ఆగర్భ శత్రువులను కలిపిన వింటర్‌ ఒలింపిక్స్‌..!!

- February 10, 2018 , by Maagulf
ఆగర్భ శత్రువులను కలిపిన వింటర్‌ ఒలింపిక్స్‌..!!

మంచు కొండల్లో అద్భుతం ఆవిష్క్రతమైంది. క్రీడా సంబరం ఆగర్భ శత్రువులను కలిపింది. ఉప్పు-నిప్పులా ఉండే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సామరస్యం వెల్లివిరిసింది. వింటర్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో నీలం-తెలుపు రంగులతో కూడి ఐక్య కొరియా పతాకతో రెండు దేశాల అథ్లెట్లు మార్చ్‌పాస్టలో పాల్గొనగా స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెల్లెలు కిమ్‌ యో జిం గ్‌, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ముందు వరుసలోనే ఆశీనులై క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. 

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో చేతులు కలిపారు కిమ్ సోదరి యో జెంగ్. వీఐపీలు కూర్చునే ప్రాంతంలోకి వచ్చినప్పుడు తొలుత మూన్‌.. యో జోంగ్‌తో కరచాలనం చేశారు. అనంతరం కొరియా అథ్లెట్లు కవాతు చేస్తున్నప్పుడు మరోసారి ఇరువురు నేతలూ చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేసుకున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు సంకేతాలు వెలువడినట్లయింది. కొరియా యుద్ధం అనంతరం.. ఉత్తర కొరియా పాలక రాజవంశ కుటుంబం నుంచి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తొలి వ్యక్తిగా యో జోంగ్‌ నిలిచారు. 

ఇక ప్యాంగ్‌ చాంగ్‌లో  శీతాకాల ఒలింపిక్స్‌ అట్టహాసంగా ఆరంభమయ్యాయి. బాణసంచా వెలుగుల్లో స్టేడియం మెరిసిపోయింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ప్రారంభించారు. సంయుక్త కొరియా మహిళా హాకీ జట్టు అందించిన కాగడాతో దక్షిణ కొరియా ఫిగర్‌ స్కేటింగ్‌ స్వర్ణ పతక మాజీ విజేత కిమ్‌ యు నా ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించింది. 

కొన్నేళ్లుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరుదేశాలు కయ్యానికి కాలు దువ్వడంతో ఎప్పుడు యుద్ధమెస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఉత్తర కొరియా వరుస అణ్వస్త పరీక్షలతో టెన్షన్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో క్రీడా సంబరం రెండు దేశాలను కలిపింది. ఉత్తర కొరియా నియంత కిమ్ సోదరే వేడుకకు రావడంతో దక్షిణి కొరియా ప్రభుత్వం కూడా ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com