నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ఫ్రెంచ్‌ ఏరియల్‌ షో

- February 13, 2018 , by Maagulf
నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో  ఫ్రెంచ్‌ ఏరియల్‌ షో

దేశంలోనే మొదటి ప్రదర్శనకు వేదికైన నగరం

హాజరైన మంత్రి చందూలాల్‌ 

హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారి రాజధాని వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్‌ ఏరియల్‌ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్‌ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్‌ ఇండియా కల్చరల్‌’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్‌ ఏరియల్‌ షో తొలి ప్రదర్శనను నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో మంగళవారం రాత్రి నిర్వహించారు.

ఫ్రెంచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రాన్సిస్‌ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్‌ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 18 మందిలో ఆరుగురు యువతులు ఉండటం విశేషం. దేశంలోనే తొలి ఫ్రెంచ్‌ ఏరియల్‌ షోను నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫ్రెంచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రాన్సిస్‌ డైరెక్టర్‌ ఎమిలిన్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com