నటనకు గుడ్బై .. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ప్రకటించిన కమల్‌హాసన్

- February 14, 2018 , by Maagulf
నటనకు గుడ్బై .. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ప్రకటించిన కమల్‌హాసన్

చెన్నై, ఫిబ్రవరి 14:రాజకీయాలపై పూర్తిగా దృష్టిపెట్టబోతున్నానని, అందువల్ల ఇక సినిమాల్లో నటించనని ప్రఖ్యాత సినీనటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలూ పూర్తయ్యాక ఇక పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న కమల్‌హాసన్ త్వరలో తన పార్టీ పేరు, ప్రణాళికను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బోస్టన్‌లోని హార్వర్డ్ వర్శిటీలో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మనసులోని మాట వెల్లడించారు. కాషాయ వర్ణాన్ని వ్యతిరేకిస్తున్న కమల్ రాజకీయాల్లో తను ఎంచుకున్న రంగు 'నలుపు' అని, ఇది ద్రవిడ స్వరానికి, నల్లని మేనికి ప్రతిబింబమన్నారు. సాంస్కృతికంగా నలుపు చెడ్డ రంగేమీకాదన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో పరాజయం పాలవుతానని అనుకోవడం లేదని, నిజాయితీగా జీవించడానికి ఏదోఒకటి చేయాల్సి ఉందన్నారు. ఇన్నాళ్లూ రాజకీయ వేదికంటూ లేకపోయినప్పటికీ 37 ఏళ్లుగా సమాజసేవ చేస్తూనే ఉన్నానని చెప్పిన కమల్ అప్పటినుంచి తన వెనుక 10 లక్షలమంది విధేయులైన కార్యకర్తలు ఉన్నారని, ప్రజాసంక్షేమానికి పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో 250 మంది న్యాయవాదులు కూడా ఉన్నారన్న కమల్ సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజాసేవ కోసమే వస్తున్నానని చెప్పారు.

కేవలం నటుడిగానే జీవితాన్ని ముగించాలని అనుకోవడం లేదని, ప్రజాసేవలో తుదిశ్వాస విడవాలని తనకు తానుగా చేసుకున్న ప్రతిన మేరకే రాజకీయాల్లోకి వచ్చానని కమల్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com