మాల్యాను మించిపోయిన ఘనుడు 'నీరవ్ మోడీ' చరిత్ర చూస్తే...

- February 16, 2018 , by Maagulf
మాల్యాను మించిపోయిన ఘనుడు 'నీరవ్ మోడీ' చరిత్ర చూస్తే...

నీరవ్ మోడీ.. వయసు 47 ఏళ్లు. పుట్టింది ఇండియాలో. పెరిగింది బెల్జియంలో. ఈ వజ్రాల వ్యాపారి ఇప్పుడు పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు బ్యాంకులను బురిడీ కొట్టించిన ఈ స్కామ్‌స్టర్ చరిత్ర చూస్తే అవాక్కవుతారు.
డైమండ్స్ వ్యాపార రంగంలో నిరవ్ మోడీ ఒక బ్రాండ్. తన పేరిటే వజ్రాభరణాల బిజినెస్ ను సృష్టించి పేరొందాడు. న్యూయార్క్ లో తన కంపెనీకి చెందిన ఓ షాప్ ను డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా ఓపెన్ చేయించాడు అంటే అతడి స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నీరవ్ మోడీ బెల్జియంలో స్థిరపడిన ఓ గుజరాతీ కుటుంబానికి చెందినవాడు. ఈ ఆభరణాల వ్యాపారి బెల్జియంలోని వార్టన్ బిజినెస్ స్కూల్ లో డ్రాపవుట్ గా వెనుదిరిగాడు. అయితే అనూహ్యంగా భారత్ కు తిరిగి వచ్చిన నిరవ్ తన మేనమామ ప్రముఖ గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోస్కీ దగ్గర చేరాడు. 
1999లో నిరవ్ మోడీ ఫైర్ స్టార్ డైమండ్ పేరిట ఓ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ సుమారు రూ. 14 వేల కోట్లు పలుకుతోంది. 2008లో తన స్నేహితుడికి గిఫ్ట్ ఇచ్చేందుకు ఇయర్ రింగ్ తయారీతో ఆభరణాల డిజైనింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టిన నిరవ్ మోడీ ప్రస్తుతం జువెలరీ రంగంలో తిరుగులేని కీర్తిని గడించాడు. ఇక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ల పేర్లు వింటే దిమ్మతిరిగి పోవాల్సిందే. హాలివుడ్ తారలు కేట్ విన్స్ లెట్, షరాన్ స్టోన్, నొవొమి వాట్స్ లాంటివారు నీరవ్ జువెలరీ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు. భారత్ లో ఐశ్వర్యారాయ్ మొదలు షారుఖ్, కత్రీనా, ప్రియాంక చోప్రా లాంటి వారంతా నిరవ్ మోడీ మోడల్స్ గా తళుక్కుమన్నారు. ఆస్కార్ అవార్డులు అందుకునే సెరిమనీలో హాలీవుడ్ తారలు నీరవ్ కలెక్షన్స్ ధరిస్తారంటే అతడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  
నిరవ్ మోడీకి చెందిన జువెలరీ స్టోర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. న్యూయార్క్‌లోని 727 మాడిసన్ ఎవన్యూ, లండన్‌లోని 31 ఓల్డ్ బాండ్ స్ట్రీట్, ముంబైలోని కొలబా లాంటి ఖరీదైన ప్రాంతాల్లో నిరవ్ జ్వలరీ షాపులున్నాయి. లాస్ వెగాస్, హవాయ్, సింగపూర్, బీజింగ్, దుబాయ్ తో పాటు దేశీయంగా ముంబై, ఢిల్లీలో కూడా నిరవ్ మోడీకి చెందిన షోరూంలు ఉన్నాయి. ఇటీవలే మకావుతో పాటు న్యూ ఢిల్లీలోని డీఎల్ ఎఫ్ చాణక్య మాల్ లో కొత్త షోరూంలను ప్రారంభించారు. 2020 నాటికి 100 స్టోర్స్ స్థాపించడమే లక్ష్యమని నీరవ్ పలుమార్లు తెలిపారు. 
అంతేకాదు 2016 ఫోర్బ్స్ భారతీయ బిలియనీర్ల జాబితాలో 1.74 బిలియన్ డాలర్ల సంపదతో పేరు గడించాడు నీరవ్. జనవరి 23న ప్రధాని నరేంద్ర మోడీ డావోస్ లో పాల్గొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భారత వ్యాపార బృందంలో నీరవ్ మోడీ తళుక్కున మెరవడం కొసమెరుపు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com