హీరో నాని ' అ! . తెలుగు బులెట్ రివ్యూ
- February 16, 2018
నటీనటులు : కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఇషా, రెజీనా, అవసరాల శ్రీనివాస్
నిర్మాతలు : నాని, ప్రశాంతి త్రిపినేని
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్ : గౌతమ్ నెరుసు
మ్యూజిక్ : మార్క్ కె. రాబిన్
సక్సెస్ ఫుల్ హీరోగా వరస సినిమాలు చేస్తున్న నాని నిర్మాతగా మారుతున్నాడు అనగానే ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇందులో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని చెప్పి మరీ ఈ సినిమా విడుదల చేసాడు నాని. ఓ హీరోని ఇంతగా కదిల్చిన ,కథ ఏంటి ? ఆ కధకు తగ్గట్టు సినిమా ఉందా, లేదా అన్నది చూద్దాం.
"అ" సినిమా లో కథ లేదు. ఎస్.
జీవితం వుంది. జీవిత అనంతరం వుంది. ఎలా బతకాలో వుంది . ఎలా బతకకూడదో వుంది.
చివరకు ఎలా చావాలో వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు. ఇలాంటి విషయాన్ని ఈ తరానికి నచ్చేట్టు తీస్తాను అని ఎవరైనా అంటేనే పెద్ద సాహసం. కానీ తీసి చూపడం, మెప్పించడం ఇంకా పెద్ద విషయం.
జీవిత గమ్యాన్ని నిర్దేశించే ఇలాంటి సినిమా ఓ అల్ట్రా మోడరన్ ఫుడ్ కోర్ట్ లో జరుగుతుంటుంది. అందులో ఓ టేబుల్ ముందు తల్లిదండ్రులని తమ పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్న లెస్బియన్ జంట ( ఈషా , నిత్యా మీనన్ ). ఆత్మహత్య, సామూహిక హత్యలు చేయాలనుకుంటూ పుట్టినరోజునాడే అక్కడకు ఆయుధంతో వచ్చిన ఓ అమ్మాయి( కాజల్ ). లవర్ చెప్పిన మాట కోసం ఓ దొంగతనానికి సహకరించాలి అనుకుని ఇబ్బంది పడే డ్రగ్ అడిక్ట్ వెయిట్రెస్ ( రెజీనా ).
బిజినెస్ పెంచడానికి ఓ ఇన్వెస్టర్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న ఓనర్( ప్రగతి ) , తనంతటివాడు లేదని భావించే ఓ మెజీషియన్ ( మురళి ), ధైర్యం, తెలివితేటలు, తోటివారికి సాయం చేయాలనుకునే ఓనర్ కుమార్తె అయిన చిన్న పాప, యు ట్యూబ్ మీద ఆధారపడి వంట వాడి ఉద్యోగం కోసం వచ్చే నిరుద్యోగి ( ప్రియదర్శి ) , ఆ నిరుద్యోగితో స్నేహం చేసే చేప ( నాని ) , మొక్క ( రవితేజ). వీళ్లందరితో పాటు ఎప్పటికైనా పెద్ద సైంటిస్ట్ కావాలి అనుకునే వాచ్ మెన్ ( అవసరాల శ్రీనివాస్ ). టైం మెషిన్ కనిపెట్టి దూరం అయిన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలని అతను చేసే ప్రయత్నం. ఇలా ఈ అందరికీ ఒక్కటే వేదిక ఆ ఫుడ్ కోర్ట్.
అక్కడే ఏమి జరిగింది అన్నదే "అ" సినిమా.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ కథ రాసుకుని నానిని ఒప్పించినప్పుడే అతను టాలెంటెడ్ అని అర్ధం అవుతుంది. అయితే అది అక్కడితో అయిపోలేదు. ఇంత సంక్లిష్టం అయిన కధని తెరకు ఎక్కించడం మాములు విషయం కాదు.
కానీ దర్శకుడు ఎక్కడా తడబడలేదు. అనుకున్న విషయాన్ని అనుకున్నట్టు చెప్పేసాడు. అయితే కథ లో ఉప కధలు , ఆ ఉప కధల్లో పాత్రలు , వాటి ఉద్దేశాలు ఇవన్నీ బుర్రకు ఎక్కించుకోవడం ప్రేక్షకుడికి పరీక్షే. ఆ పరీక్ష రాసేందుకు మామూలు తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకుడు సరిపోతాడా లేదా అన్నదాని మీదే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ విశాల విశ్వమంత పెద్దది , కానీ వేదిక మాత్రం ఓ ఫుడ్ కోర్ట్ అంత చిన్నది. కానీ ఆ విశ్వానికి ఈ ఫుడ్ కోర్ట్ ఓ మినియేచర్ అని చూపడంలోనే దర్శకుడు ప్రతిభ అర్ధం అవుతుంది. మనుషులు దగ్గరే దర్శకుడు ఆగిపోలేదు. మనసులు దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ రేగే సుడిగుండాలు , అగ్నిపర్వతాలు , అనుభవాలు , అనుభూతులు అన్నిటినీ కాచివడపోసి ఓ కషాయం తయారు చేసాడు. కషాయం అనడంలో ఉద్దేశం ఏమిటంటే అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది కానీ రుచిగా ఉంటుందా అంటే చెప్పలేము.
కోటానుకోట్ల పాలపుంతల్లో మనది ఒకటి. దాంతో పోల్చుకుంటే మనకు తెలిసిన సౌర మండలం చిన్న బిందువు.
ఆ బిందువులో భూమి ఇంకా చిన్న చుక్క. ఆ భూమి మీద దాదాపు 80 లక్షల రకాల జీవుల్లో మనిషి ఒకడు. అలాంటి మనుషులు ఈ భూమి మీద 700 కోట్ల మందికి పైనే. ఇలా చూసుకుంటే మనిషి ,మనసు , భావాలు ఎంత చిన్నవో అర్ధం అవుతుంది.
కానీ ఆ మనసులో ఈ విశ్వమంత ఆలోచనలు నడుస్తుంటాయి అని దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. అది శంకరుడి అద్వైతం , కృష్ణుడు భగవద్గీత లోతుల్ని ఉపనిషద్ లోని " అసతోమా సద్గమయ , తమసోమా జ్యోతిర్గమయ , మృత్యోర్మం అమృతంగమయ" అనే శాంతి మంత్రానికి ముడి పెట్టి విశ్వపు లోతుల్ని , మనసు కున్న అంతులేని సృజనని మ్యాచ్ చేసిన దర్శకుడికి హాట్స్ ఆఫ్ ..ఈ కధకు ఓకే చెప్పిన నిర్మాత నానికి తెలుగు సినిమా తరపున థాంక్స్ .
ఇక ఈ సినిమాలో నటీనటులంతా బాగా చేశారు. ఇక చేపకు వాయిస్ ఓవర్ ఇచ్చిన నాని , మొక్క కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజ సూపర్బ్.
అయితే సినిమా కోణంలో చూసినప్పుడు ఇది దర్శకుడి విశ్వరూపమే. నాని అన్నట్టు ఈ సినిమా ఇప్పటికి ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చుతుందో, లేదో కానీ ఎప్పటికైనా నచ్చే రోజు వస్తుంది. భగవద్గీత చదివే వాడి మానసిక స్థాయిని బట్టి అర్ధం అవుతుంది అంటారు. "అ!" సినిమా కూడా అంతే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి