నేడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
- February 20, 2018
' మమ్మీ ...టెంపుల్ కు వెళ్ళి.. కోకోనటి బ్రేక్ చేసి వస్తా " అనే సరికొత్త తరం తెలుగునాట తయారయ్యారు. ప్రజల జీవితానికి ప్రతిబింబం వారి భాష. ప్రజల ఊహలకు, కళాసృష్టికి మాధ్యమం అదే. భాష భావ ప్రకటనకే కాదు, భావాలను తీర్చిదిద్దుకోవడానికి సైతం ఒక సమాజపు ఆత్మ గౌరవం సొంత భాషతోనే వ్యక్తమవుతుంది. స్వేచ్ఛ పొందిన సమాజంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. కాబట్టి వారి నాల్కల మీది భాషే పరిపాలక భాష కావాలి. సాంస్కృతికంగా, రాజకీయంగా, సాహిత్యపరంగా మాతృభాషకు ఉన్న స్థానం ఇది.ఇక్కడ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి బీజం బంగ్లాదేశ్ ఇచ్చినదే. తూర్పు బెంగాల్‌తో సహా మొత్తం పాకిస్థాన్‌లో ఉర్దూను అధికార భాషగా ప్రకటిస్తూ తొలి గవర్నర్ జనరల్ జిన్నా మార్చి 21, 1948న ఆదేశాలు ఇచ్చాడు. దీనితో తూర్పు బెంగాల్ వేడెక్కింది. 7.05 శాతం మాత్రమే ఉర్దూ మాట్లాడే జనాభా ఉన్న తూర్పు బెంగాల్ (నేటి బంగ్లాదేశ్)లో బెంగాలీ భాష కోసం 1952లో ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పుడు జరిగిన కాల్పులలో కొందరు మరణించారు. ఆ సంఘటననే యునెస్కో ప్రేరణగా స్వీకరించింది. యునెస్కో పిలుపు సంకుచితం కాదు. ముఖ్యంగా భారత్ వంటి బహుళ సంస్కృతులు ఉన్న దేశానికి ప్రయోజనకరం కూడా. సాంస్కృతిక, భాషా వైవిధ్యాలను నిలుపుకోవడానికి మాతృ భాషలను రక్షించుకోవాలన్నదే యునెస్కో పిలుపు అంతరార్థం. మాతృభాషను మాట్లాడడం ఒక హక్కుగా గుర్తిస్తూ 1996లో వెలువడిన బార్సిలోనా ప్రకటనను అందరి దృష్టికి తీసుకురావడం అవసరమని యునెస్కో అభిప్రాయపడుతోంది.బహుభాషలతో విద్య నేర్పడంవల్ల కలిగే ప్రయోజనాలను గురించి హెలెన్ పిన్నాక్ ఏనాడో నివేదిక ఇచ్చారు. అది విద్యాభివృద్ధికి కీలకం కూడా. విద్యార్థి జయాపజయాలు, విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పడం వంటివి భాషతో ముడిపడి ఉన్నాయి. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగడం ఉత్తమమని శాస్త్రీయ పరిశోధనలే చెబుతున్నాయి. కానీ ఈ వాస్తవికతను పట్టించుకోవడానికి ముందుకు వస్తున్న ప్రభుత్వాలు కానీ, తల్లిదండ్రులు కానీ ఇప్పుడు తక్కువే.బ్రిటిష్ పాలకుల భాష కావడం వల్ల ఇంగ్లిష్ అంటే భారతదేశం అంతటా ఒక దశలో మోజు ఉన్న మాట నిజం. అనేక కారణాల వల్ల స్వతంత్ర భారతదేశంలోనూ ఆ మోజు కొనసాగింది, ప్రపంచీకరణ తరువాత అది వ్యవస్థీకృతమైపోయింది. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ ఆధిపత్యం, అనివార్యత ఇందుకే. కంప్యూటర్, అంతర్జాలాలతో పరిచయం ఇంగ్లిష్‌తోనే సాధ్యమవుతాయి. దీనితో పాటు ఐటీ విప్లవం తరువాత అందొచ్చిన బహుళ జాతి సంస్థల ఉద్యోగాలు, అమెరికా, ఇతర దేశాల ఉద్యోగాల మీద మోజు, అవసరం-ఇంగ్లిష్ మాత్రమే జీవన సాఫల్యాన్ని సిద్ధింప చేస్తుందన్న నమ్మకానికి చాలామంది భార తీయులని, ముఖ్యంగా తెలుగువారిని గురి చేసింది. ఇది అవాస్తవం కాదు. తిండి పెట్టేది ఇంగ్లిష్ అన్న విశ్వాసం ఈనాడు ఊడలు వేసింది. ‘ప్రభుత్వ వ్యవహారాలను తెలుగులోనే నిర్వహించాలని ఈ సభవారు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నారు’అంటూ సెప్టెంబర్ 29, 1955న శాసనసభ కర్నూలులో ఉండగా వావిలాల గోపాలకృష్ణయ్య తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు ‘సాధ్యమైనంత త్వరలో’ అన్న సవరణ చేశారు. ఆ సుముహూర్తం ఇప్పటికీ రాలేదు. ఇది చర్చకే రాకుండా నాటి ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇటీవల అధికార భాషా సంఘానికి కొత్త అధ్యక్షుడు ప్రమా ణం చేశాక ఇచ్చిన తొలి ప్రకటన-ప్రభుత్వ ఆదేశాలు తెలుగులో వెలువరించేందుకు కృషి చేస్తా’ననే. ఇదీ అమ్మభాష మీద మన మమ కారం. కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ దుస్థితి లేదు. మేధావులలో, రచయితలలో మాతృభాష మీద గౌరవం కనిపిస్తుంది. తెలుగు భాషా ప్రాంతాల వారు ఒక సంధి దశలో ఉన్నారు. ప్రభుత్వంలో గానీ, ప్రజలలో గానీ మాతృభాష మీద ఇంత శీతకన్ను గతంలో ఎప్పుడూ లేదు. బ్రిటిష్ ఇండియాలో ఉన్నత విద్యాభ్యాసం చేసినవారంతా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నారు. ప్రావీణ్యం సంపాదించారు. కానీ వారంతా భారతీయ భాషలలో కూడా అంతే అభినివేశం కలిగినవారన్న సంగతి మరచిపోరాదు. ఆ తరువాతి తరాలు మాత్రం మళ్లీ ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గాయి. ఐటీ రంగానికి ఇప్పుడు ప్రతినిధులు వీరే. ఇంకా చిత్రం, ఆత్మ గౌరవం అనే భావన బలపడుతూ ఉన్న కాలంలో అది వ్యక్తం చేయడానికి ఏకైక సాధనమైన మాతృభాష నిర్లక్ష్యానికీ, అపహాస్యానికీ గురికావ డం వింత. ఈ నేపథ్యంలో తిరుపతి సభలు జరుగుతున్నాయి. ప్రజల నాల్కల మీద ఉండే విధంగా రూపొందించడంతో పాటు, జీవికను చూపే భాషగానూ తెలుగు ఆవిర్భవించే విధంగాచర్యలు తీసుకోవ డం ముఖ్యం. అమ్మభాషను రక్షించుకోవడం అందరి కర్తవ్యం.భాషాపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం మరియు బహుభాషితాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 2000 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవంను నవంబర్ 1999 లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సాధారణ సమావేశం ద్వారా ప్రకటించారు.1952లో అప్పటి పాకిస్థాన్ యొక్క రెండవ జాతీయ భాషగా తమ భాష ‘బంగ్లా’ను గుర్తించాల్సిందిగా పోరాటం చేసిన ఇద్దరు బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఇప్పటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కాల్చి చంపిన రోజుకు గుర్తుగా ఈ ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. ఎన్నో పదాలు, ఎన్నో పద్యాలు, ఎన్నో వచనాలు, ఎన్నో కందాలు, మరెన్నో వన్నెల చమత్కారాలతో నిండి ఉంది. ఇన్ని తెలిసిన మన తెలుగు భాష తెల్లభోయింది.తేనెలు పలికిన మన తెలుగు బిడ్డలు, తెలివైనవారు అయ్యారని మురిసేలోగా, తెలుగు తల్లి ఎదలో ఎదిగిన తన ఎత్తైన బిడ్డలు ఎడ్డివారై పోయారని భాధపడుతుంది మన భాష ఉచ్చారణలో ఉత్తీర్ణులై వున్న తెలుగు బిడ్డలు దేనికి పనికిరాకుండా ఉత్తివారై పోయారని అంటుంది మన భాష. ఇది కలియుగం అంటే చెడుకే ప్రాధాన్యత ఎక్కువ.ఉన్నది ఉన్నట్టుగా రాసి, రాసిన ప్రతి అక్షరాన్ని సమాన ప్రాధాన్యతతో పలకగలిగే ఈ చక్కనైన తెలుగు భాష, ఏ నియమాలులేకుండా, వంకరటింకరగా రాసి, రాసిన పదాలను ఎప్పుడు ఎలా ఉచ్చరించాలో కూడా తెలిసిన కొన్ని పరభాషల ముందు నోరెత్తలేక మూగదైపోయింది.ఆదరణ కరువైన నా తెలుగు భాష ఆదుకోమని నిన్ను పిలుస్తుంది.అన్ని వన్నెలున్న మన తెలుగు భాషనిన్ను వెన్ను తట్టమంటుంది. పరభాషలలో తన పసి బిడ్డలు సంభాషిస్తుంటే, తనను పలుకరిస్తారని పరితపిస్తుంది. జీవమున్న జీవులు తమ భాషను నిర్జీవం చేసి జీవచ్చావలై జీవిస్తున్నారని తల్లడిస్తుంది తల్లి భాష మరుగైన మన తెలుగు భాష మెరుగయ్యేదెన్నడో ??
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







