విశాఖ పట్టణం లో పార్టనర్ షిప్ సమ్మిట్

- February 23, 2018 , by Maagulf
విశాఖ పట్టణం లో పార్టనర్ షిప్ సమ్మిట్

విశాఖ : ప్రపంచంలోనే పేరుగాంచిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వారి ప్రతినిధి బృందాలు హాజరయ్యే సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటి నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. సమ్మిట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు 500 మంది కార్మికులు ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. మధ్యాహ్నం 2.30కు భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో 14 దేశాల నుంచి 
విశాఖ వేదికగా జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో 14 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు, 60 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరి కోసం ప్రధాన వేదికతోపాటు మరో ఐదు సమావేశమందిరాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వీటిల్లో 9 ప్లీనరీ సమావేశాలు, 8 సెక్టోరల్‌ సమావేశాలు, జపాన్‌, దక్షిణ కొరియా సదస్సులు జరుగనున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆశీనులయ్యేందుకు అనువుగా ఫర్నీచర్‌, సౌకర్యవంతమైన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎటు చూసినా సమ్మిట్‌ ప్రాంగణాన్ని పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు. పది ఎకరాలు విస్తీర్ణంలో తాత్కాలిక సమావేశమందిరాలు, చర్చలు జరిపేందుకు ప్రత్యేక గదులు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వేదికలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా కోసం కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సౌకర్యంతోపాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. జపాన్‌, కొరియా దేశాల నుంచి ప్రత్యేకంగా పారిశ్రామిక బృందాలు వస్తున్నాయి. దుబాయ్‌, యూఏఈలాంటి అరబ్‌ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్‌కు తరలివస్తున్నారు. దాదాపు 2వేల మంది వరకు విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరంతా నగరంలో ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విదేశాలకు చెందిన 18 మంది మంత్రులతోపాటు.. పదిమంది అంబాసిడర్లు కూడా భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్నారు.

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ సోదరుల బృందం 
విశాఖ సమ్మిట్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ సోదరుల బృందం కూడా పాల్గొంటుంది. జీఎంఆర్‌ అధినేత మల్లికార్జునరావుతోపాటు మరికొంతమంది పారిశ్రామిక ప్రముఖులు వస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య ముఖ్య అథితిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్నారు. చంద్రబాబు ఈ ఉదయం విశాఖకు చేరుకుంటారు. దేశ, విదేశీ ప్రతినిధుల కోసం విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల దగ్గర ప్రభుత్వం అధికారులతో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది.ప్రపంచ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నేటి నుంచి 26 వరకు హార్బర్‌ పార్క్‌ రోడ్డులోని ఏపీఐఐసీ మైదానం వైపు వాహనాలను మళ్లించారు. పెదవాల్తేరు బస్‌డిపో కూడలి నుంచి కోస్టల్‌ బ్యాటరీ కూడలి వరకూ బీచ్‌రోడ్డులో ఎలాంటి వాహనాలను నిలపకూడదు. వాహన ప్రయాణాలను కూడా నిషేధించారు. స్థానిక నివాసితులంతా రాకపోకలు సాగించేందుకు బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయం వద్ద ఉన్న పోలీస్‌ అవుట్‌పోస్టు కార్యాలయంలో పాసులు ఇచ్చారు. మూడు రోజులపాటు జరిగే పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా పెట్టుబడులు భారీగా రాబట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పలు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com