ఇజ్రాయిల్లో దేశ ప్రధాని రాజీనామా చేయాలంటూ ఆందోళనలు

- February 25, 2018 , by Maagulf
ఇజ్రాయిల్లో దేశ ప్రధాని రాజీనామా చేయాలంటూ ఆందోళనలు

- ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ 
టెల్‌అవీవ్‌ : ఇజ్రాయిల్‌ నిరసనలతో అడ్డుడికింది. దేశ ప్రధాని రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు కదం తొక్కారు. నెతన్యాహూ తన పదవికి రాజీనామా చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం, విదేశాల నుంచి ముడుపులు స్వీకరించిన ఆరోపణలు నెతన్యాహూ ఎదుర్కొంటున్నారు.ఈనేపథ్యంలో ప్రధాని తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. రాజధాని టెల్‌అవీవ్‌ వీధుల్లో ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నెతన్యాహూ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధాని తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కోరారు. స్థానిక మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం...టెల్‌ అవీవ్‌లో తీసిన ర్యాలీలో 1500 మంది నిరసనకారులు పాల్గొన్నారు. ' నెతన్యాహూ లాంటి అవినీతి ప్రధానిని మేం చూడలేదు. చట్టం ముందు అందరూ సమానులే. నెతన్యాహూ స్వచ్చంధంగా తన పదవికి రాజీనామా చేయాలి' అంటూ నిరసనకారులు నినదించారు. కాగా, అవినీతి, అధికార దుర్వినియోగం కేసుల్లో ప్రధాని నిందితుడనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని గతవారం పోలీస్‌ ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నెతన్యాహూని విచారించేందుకు తమను అనుమతించాలంటూ అటార్నీ జనరల్‌కు విజ్ఞాపన పత్రం పంపారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌ దశలో ఉంది. అటార్నీ జనరల్‌ నుంచి అనుమతి లభించినట్టయితేనే నెతన్యాహూను విచారించేందుకు వీలుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com