కాలిఫోర్నియాలో అంతరిక్షం నుంచి అంతర్జాలం.. 'స్పేస్ఎక్స్' ప్రయోగం విజయవంతం!

- February 26, 2018 , by Maagulf
కాలిఫోర్నియాలో  అంతరిక్షం నుంచి అంతర్జాలం.. 'స్పేస్ఎక్స్' ప్రయోగం విజయవంతం!

 వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ఫాల్కన్ హెవీని విజయవంతంగా ప్రయోగించడమేకాక, తొలిసారిగా టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారక గ్రహ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మళ్లీ వార్తల్లో నిలిచారు.

ఈసారి ఆయన అంతరిక్షం నుంచి అత్యంత వేగవంతమైన అంతర్జాలాన్ని అందించడం కోసం రెండు ఉపగ్రహాలను ప్రయోగించారు. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ వైమానిక స్థావరం నుంచి పునర్వినియోగ ద్వారా స్పెయిన్‌ పీఏజెడ్‌ ఉపగ్రహంతోపాటు స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఈ రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ప్రయోగించిన 11 నిమిషాల తర్వాత పీఏజెడ్‌ ఉపగ్రహాన్ని ఫాల్కన్-9 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహంలోని అధునాతన రాడార్‌ ప్రపంచం మొత్తాన్నీ 24 గంటల్లోనే చుట్టేస్తుంది. దీన్ని స్పెయిన్ రక్షణ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ ఉపగ్రహం భూమిని రోజుకు 15సార్లు చుట్టివస్తుంది.

ఇక స్పేస్ఎక్స్‌కు చెందిన మైక్రోశాట్ 2 ఎ, 2బి ఉపగ్రహాలు వాణిజ్య, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ ముస్క్ కల నిజమైంది. 2024 కల్లా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా స్పేస్‌ఎక్స్ ఈ రెండు ఉపగ్రహాల ప్రయోగం జరిపింది.

ఈ ప్రాజెక్టుకు 'స్టార్‌లింక్స్' అనే పేరు పెట్టారు. 2015 జనవరిలో స్పేస్‌ఎక్స్ ఈ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందుకోసం గూగుల్, ఫిడిలిటీ సంస్థలు ఒక బిలియన్ డాలర్లను స్పేస్‌ఎక్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 12 వేల చిన్న చిన్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అతితక్కువ ఎత్తులో ఉన్న భూకక్ష్యలోకి ప్రవేశపెడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com