గల్ఫ్ లో అసువులుబాసిన మరో యువతి

- February 28, 2018 , by Maagulf
గల్ఫ్ లో అసువులుబాసిన మరో యువతి

మామిడికుదురు: మండలంలోని పెదపట్నం గ్రామ పరిధిలోని అగ్రహారానికి చెందిన బత్తుల వరలక్ష్మి(27) గల్ఫ్‌లో మృతి చెందినట్లు ఆలస్యంగా సమాచారం వచ్చింది. గత ఏడాది డిసెంబరు 18వ తేదీన ఆమె చనిపోయినా మంగళవారం సమాచారం తెలియజేయడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏజెంటు వేధింపుల వల్లే ఆమె చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన బత్తుల సత్యనారాయణమూర్తి, పెద్దిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్దమ్మాయి వరలక్ష్మి గత ఏడాది ఏప్రిల్‌లో ఉపాధి కోసం బెహ్రెయిన్‌ వెళ్లింది. గత డిసెంబరు 8న కుటుంబ సభ్యులకు చివరిసారిగా ఫోన్‌ చేసి మాట్లాడింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న చెల్లెలు శ్రీవాణికి డిసెంబరు 14న ఫోన్‌ చేసినా ఇంట్లోనే ఫోన్‌ ఉండిపోవడంతో మాట్లాడటం కుదరలేదు. మళ్లీ అప్పట్నించీ ఏవిధమైన సమాచారం లేదు. అక్కడే ఉంటున్న విజయవాడకు చెందిన ఓ మహిళ అక్కడి చర్చి వద్ద తనకు తెలిసిన ఈ సమాచారాన్ని కుటుంబికులకు అందజేసింది. న్యాయవాది నల్లి శంకర్‌ విషయాన్ని రాయబార కార్యాలయానికి నివేదించడంతో వరలక్ష్మి మృతి చెందినట్లు వెల్లడైందని తల్లిదండ్రులతోపాటు కుటుంబికులు బత్తుల అశోక్‌, భూపతి దుర్గాప్రసాద్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చింతలపల్లికి చెందిన ఓ మహిళా ఏజెంటు డబ్బు కోసం తరచూ ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com