కడప నుండి విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసులు
- March 01, 2018
కడప : కడప నుండి విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసు ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పూసర్ల శివ ప్రసాద్ గురువారం ఉదయం విమాన సర్వీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ రీజనల్ కనెక్టీవిటి పథకంలో భాగంగా 2017 ఏప్రిల్ 27 నుండి కడపలో విమాన సర్వీసులు ప్రారంభం అయినట్లు చెప్పారు. మొదటగా హైదరాబాదుకు, తర్వాత చెన్నైకి ట్రూజెట్ సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించిందని, నేడు అదే సంస్థ ద్వారా విజయవాడకు 3వ విమానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ 8 నెలల కాలంలో దాదాపు 30 వేలమంది ప్రయాణించినట్లు పేర్కొన్నారు. 2018-19కి లక్ష మంది ప్రయాణికులు లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మార్చి 31న ఎయిర్ ఏషియా వారి ద్వారా చెన్నై-కడప-చెన్నై 4వ విమానాన్ని నడపనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కడప ఎయిర్‌పోర్ట్‌లో 1719 మీటర్ల పొడవునా రన్ వే ఉందని, దానిని రూ.100 కోట్లతో 2019 మార్చి నాటికి 2500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో విస్తరణ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. విస్తరణ తర్వాత నైట్ సర్వీసులు, నైట్ ల్యాండింగ్ వస్తాయన్నారు. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే వల్లూరు మండలం వద్ద వంద ఎకరాలలో 6 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులు ప్రాసెస్‌లో ఉన్నాయని, ఒక సంవత్సరంలోగా పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే మన రాష్ట్రంలోని రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లకు విద్యుత్ సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ సోసియల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వల్లూరు మండలంలో రూ.8 లక్షలతో ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కడప విమానాశ్రయ బ్యూటిఫికేషన్‌కు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఈ మేరకు ఇటీవల జరిగిన ఏరోడ్రోమ్ కమిటీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ట్రూజెట్ ఆపరేషన్స్ హెడ్ ప్రసాద్ మాట్లాడుతూ.. కడప నుండి విమాన ప్రయాణానికి ప్రజల రెస్పాన్స్ బాగుందన్నారు. నేడు ప్రారంభించిన విజయవాడ సర్వీసుకు దాదాపు 90 శాతం సీట్లు బుక్ అయినట్లు చెప్పారు. కడప మీదుగా చెన్నై, మైసూర్‌లకు కనెక్టీవ్ విమాన సర్వీసులను కూడా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాదుకు 81.5 శాతం, చెన్నైకి 72 శాతం మేర ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు. టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండటంతో ప్రయాణికుల స్పందన బాగుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ ఎటిసి ఇంఛార్జి బిజూ నారాయణ, సెక్యూరిటీ ఇంచార్జ్ అశోక్ రెడ్డి, ఎయిర్పోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి