తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్: 12మంది మావోల హతం

- March 02, 2018 , by Maagulf
తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్: 12మంది మావోల హతం

భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా పరిధిలోని చర్ల-వెంకటాపురం అటవీప్రాంతంలోని కస్తూరిపాడ్ వద్ద పోలీసులకు మావోలకు మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతి చెందిన మావోల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్టు సమాచారం. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, హరిభూషణ్ అలియాస్ జగన్ మృతి చెందినవారిలో ఉన్నట్టు తెలుస్తోంది. హరిభూషణ్ ప్రస్తుతం పార్టీ తెలంగాణ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం.

మావోల కాల్పుల్లో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ సుశీల్ కుమార్ కూడా మృతి చెందినట్టు సమాచారం. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో ఒక ఏకె-47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య 20కి పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

కాగా, గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. జిల్లాలో మరిన్ని దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో.. గత రెండు నెలలుగా అక్కడ పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎన్‌కౌంటర్ కూడా చోటు చేసుకుంది.

ఎన్‌కౌంటర్ బూటకం: విరసం నేత వరవరరావు

భద్రాచలం ఏజెన్సీలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. మావోయిస్టులను పట్టుకొని వచ్చి తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దులో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై తక్షణమే న్యాయవిచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com