ఐపీఎల్ 2018: ప్రారంభ వేడుకల బడ్జెట్‌, తేదీలో మార్పు

- March 05, 2018 , by Maagulf
ఐపీఎల్ 2018: ప్రారంభ వేడుకల బడ్జెట్‌, తేదీలో మార్పు

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 11వ సీజన్‌ ప్రారంభ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని బీసీసీఐ వేసిన భారీ ప్లాన్‌కు సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ (సీఓఏ) బ్రేక్ వేసింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో లీగ్ ఆరంభ మ్యాచ్‌కు ముందు రోజు అంటే ఏప్రిల్ 6న ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 6న క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ ప్రారంభ వేడుకల తేదీతో పాటు వేదిక కూడా మారినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. లీగ్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 7న ప్రారంభం అవుతుంది. అదే రోజున మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని గంటల ముందే వేడుకలు వాంఖడే మైదానంలో నిర్వహించాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 7, 2018 తొలి మ్యాచ్ జరిగే వాంఖడె స్టేడియంలోనే వీటిని నిర్వహించాలని సీవోఏ నిర్ణయించింది. అంతేకాదు ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వీటి కోసం రూ.50 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గతంలోనే ఆమోదం తెలిపింది. తాజాగా ఈ మొత్తాన్ని సీఓఏ రూ.30 కోట్లకు కుదించింది.

బడ్జెట్‌లో కోత, వేడుకల తేదీలో మార్పుతో ఐపీఎల్‌ నిర్వహకులు షాక్‌కు గురయ్యారు. లీగ్‌లో తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 7న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభమై మే 27తో ముగియనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com