ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

- March 15, 2018 , by Maagulf
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. ఆదిశగానే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కేన్సర్‌తో బాధపడుతున్న బీడి కార్మికురాలికి చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల తరువాత జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. శివనగర్‌, వెంకట్రావునగర్‌లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పబ్లిక్ పార్క్‌లను మంత్రి ప్రారంభించారు.తరువాత జేపీనగర్‌, బీవై నగర్‌, గవేష్‌నగర్‌, సాయినగర్‌లో వివిధ వర్గాలకు చెందిన కమ్యూనిటీ హాళ్లకు ప్రారంభోత్సవం చేశారు.

పేద ప్రజల అభ్యున్నతకి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ప్రజా సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తరువాత స్థానికులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు సెస్‌ సిబ్బంది సహకరించడం లేదని మున్సిపల్‌ సిబ్బంది కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంస్థ చైర్మన్‌ లక్ష్మారెడ్డిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పెద్దూరుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు స్థానిక నేతలు.. కేన్సర్ తో బాధపడుతున్న బీడీ కార్మికురాలు రాజేశ్వరి దీనావస్థను వివరించారు. స్పందించిన ఆయన.. ఆమెను అన్ని విధాల ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయిస్తానని, అక్కడికి తీసుకురావాలని వారికి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com