ఎయిర్‌పోర్టు కేంద్రంగా కొత్త ప్రాజెక్టులు

- March 26, 2018 , by Maagulf
ఎయిర్‌పోర్టు కేంద్రంగా కొత్త ప్రాజెక్టులు

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కొత్త ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. పదేళ్ల క్రితం ప్రారంభమైన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సేవలు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. తాజాగా మూడు రోజుల క్రితమే రూ.2 వేల కోట్ల వ్యయంతో విమానాశ్రయం విస్తరణ పనులను జీఎంఆర్‌ పోర్టు సంస్థ చేపట్టింది. ఇందులో సుమారు 1500 ఎకరాల్లో నిర్మించే ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణం ఎంతో ప్రత్యేకమైంది. పూర్తిగా జీఎంఆర్‌ సంస్థే ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణాన్ని చేపడుతోంది. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు కేంద్రంగా కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.

అందులో భాగంగానే మెట్రో రెండో దశను కేవలం విమానాశ్రయానికి మెట్రో రైలు సౌకర్యాన్ని అనుసంధానం చేసేలా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను ప్రకటించారు. సుమారు రూ.4650 కోట్లతో రాయదుర్గం - గచ్చిబౌలి మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ వరకు మెట్రో కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ సుమారు రూ.500 కో ట్లతో శంషాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు దగ్గర విమానాశ్రయం కార్గో టెర్మినల్‌కు అనుసంధానంగా మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించింది. మరో వైపు ఫలక్‌నుమా, నాగోల్‌ వరకు ఉన్న మెట్రో కారిడార్‌లను ఎయిర్‌పోర్టు వరకు నిర్మించాలన్న డిమాం డు ఉండడంతో ఆదిశగాను ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

ఇలా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కేంద్రంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులే కాకుండా టౌన్‌ షిప్‌లు, షాపింగ్‌ మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్సులు నిర్మించేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆధిభట్ల కేంద్రంగా విమానయాన రంగానికి సంబంధించిన భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు సైతం ఏర్పాటవుతున్నాయి. ఇలా అటు ప్రభుత్వ పరంగా, ఇటు ప్రైవేటు పరంగానూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌ మహానగరంలో అభివృద్ధి ఎక్కువగా ఐటీ కేంద్రగా ఉన్న మాదాపూర్‌, గచ్చిబౌలి చుట్టు పక్కల ప్రాంతాల్లో నెలకొంది. తాజాగా ఎయిర్‌పోర్టు కేంద్రంగా అభివృద్ధి జరగనుంది.

ప్రతిష్ఠాత్మకంగా ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణం..

విమానాశ్రయానికి కేటాయించిన భూముల ను ప్రత్యేకంగా వినియోగించుకునేలా ప్రణాళి కలు రూపొందించారు. హైఎండ్‌ ఎయిర్‌పోర్టు గా పిలిచే విమానాశ్రయం లోపల గ్రీన్‌ టెక్నా లజీ, న్యూ జనరేషన్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు భౌతికంగా మౌలికవసతులను ఏర్పాటు చేస్తారు. ఇలా ఎయిర్‌పోర్టు లోపల చేపట్టే ప్రాజెక్టులన్నీ జీఎంఆర్‌ గ్రూపు సంస్థే రెండున్నరేళ్ల కాలంలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 5945 ఎకరాలు ఉన్న శంషాబాబాద్‌ ఎయిర్‌పోర్టులో 1000 ఎకరాలు థీమ్‌/పోర్టు ఆధారిత అభివృద్ధి జోన్‌గా గుర్తించారు. ఇక్కడ ఆఫీస్‌ పోర్టు, మిక్స్‌డ్‌ యూజ్‌ కమర్షియల్‌ జోన్‌, ఫన్‌ పోర్టు, ఎడ్యుపోర్టు, హెల్త్‌ పోర్టులను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మిగతా 500 ఎకరాల్లో రెండు ఎస్‌ఈజెడ్‌లను ప్రతిపాదించారు. మొదటిది మల్టీ ప్రాడక్టు ఎస్‌ఈజెడ్‌ కాగా, రెండవది మల్టీ సర్వీసెస్‌ ఎస్‌ఈజెడ్‌గా విభజించారు. వీటిలో ఏరో స్పేస్‌, ఏరో సంబంధిత అభివృద్ధి కార్యకలాపాలు చేపడతారు.

మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌..

నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్‌ విమానాశ్ర యానికి నగరం నుంచి అనుసంధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్‌ పోర్టు కనెక్టివిటీ పేరుతో శంషాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు ఇంటర్‌చేంజ్‌ 250 ఎకరాల్లో మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌ను నిర్మించాలని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండేలా మల్టీ మోడల్‌ హబ్‌ను నిర్మించనున్నారు. ఇందులో రోడ్డు మార్గంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే రైలు మార్గం, ఎంఎంటీఎస్‌, మెట్రో మార్గాలన్నీ ఇక్కడే కలిసేలా ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌, ఎయిర్‌పోర్టు కార్గో టెర్మినల్‌ల మధ్య ఉన్న గొల్లపలి రైల్వే గేటు సమీపంలో 250 ఎకరాలను సేకరించి ట్రాన్‌పోర్టు హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.500 కోట్ల వరకు హెచ్‌ఎండీఏ వెచ్చించనుంది.

నగర నలుమూలల నుంచి మెట్రో.. నగరంలో మొదటి దశలో నిర్మాణంలో ఉన్న కారిడార్‌-3 నాగోల్‌ - హైటెక్‌సిటీ - రాయదుర్గం కారిడార్‌కు పొడిగింపుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. నగరంతో మెట్రో రైలు అనుసంధానం చేసేలా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేసి శరవేగంగా పనులు పూర్తి చేయనున్నారు. ఈ ఒక్క కారిడార్‌ కోసమే సుమారు రూ.4650 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. అదేవిధంగా నగరంలో ఉన్న మరో రెండు మెట్రో మార్గాలైన జేబీఎస్‌ -ఫలక్‌నుమా కారిడార్‌ను, నాగోల్‌ కారిడార్‌ను సైతం ఎయిర్‌పోర్టుకు విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇటీవల అసెంబ్లీ సమావేశా ల్లోనూ ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో భవిష్యత్తులో నగరంలో ఏ మూలనుంచైనా ఎయిర్‌పోర్టుకు చేరుకునే మెట్రో రైలు మార్గాలను నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com