షీ-కారిడార్..మహిళలకే ప్రత్యేకం
- April 09, 2018
తిరువనంతపురం: నగరం నడిబొడ్డున మహిళల కోసం ఓ ప్రత్యేక ప్రాంతం.. అందులోకి ప్రవేశించేందుకు వారికే అనుమతి.. సేదతీరేందుకు కుర్చీలు, షీ-టాయిలెట్స్, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు, గోడల నిండా స్ఫూర్తివంతమైన మహిళల విజయగాథలు, వారికి రక్షణ కల్పిస్తూ సీసీటీవీలతో నిరంతర నిఘా. ఇలా మహిళలకు అనుకూలమైన సౌకర్యాలతో ఓ ప్రత్యేక ప్రాంతం ఉంటే వారు కాసేపు స్వేచ్ఛగా గడుపగలుగుతారు కదా. కేరళ ప్రభుత్వం దీనిని త్వరలో నిజం చేయబోతున్నది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇలాంటి సౌకర్యాలతో ప్రత్యేకంగా షీ-కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వజ్హుతాకౌడ్ ప్రాంతంలోని ప్రభుత్వ మహిళా కళాశాల చౌరస్తా నుంచి కాటన్హిల్ బాలికల ఉన్నత పాఠశాల వరకు షీ-కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నది. తిరువనంతపురాన్ని మహిళల సురక్షిత, నివాస అనుకూల ప్రదేశంగా నిలుపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని నగర డిప్యూటీ మేయర్ రాఖీ తెలిపారు. ఈ కారిడార్‌తో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోనూ సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నామనే భావన పొందుతారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. టెండర్లు ఆహ్వానించామని, ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలోగా షీ-కారిడార్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. కారిడార్ డిజైన్ బాధ్యతను ఆర్కిటెక్ట్‌కు అప్పగించామని, డిజైన్ తుది దశలో ఉన్నదని చెప్పారు.
స్వేచ్ఛగా.. సురక్షితంగా..
ఈ కారిడార్‌లో రోడ్డుకు ఇరువైపులా మహిళల కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వారికి ఇష్టం వచ్చినంత సేపు అక్కడ సేదతీరవచ్చు. కారిడార్ మొత్తం సీసీటీవీ నిఘాలో ఉంటుంది. ఎఫ్ఎం రేడియో, షీ-టాయిలెట్స్, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు తదితర సౌకర్యాలుంటాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, గొప్ప విజయాలు సాధించిన మహిళలకు ఈ కారిడార్ ద్వారా నివాళులు అర్పించనున్నారు. అంతేకాకుండా విజయవంతమైన మహిళల విజయగాథలను ఇక్కడి గోడలపై పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. వారందరినీ యవతరానికి పరిచయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రాఖీ పేర్కొన్నారు. తిరువనంతపురంలో మహిళలపై నేరాలు పెరిగిపోతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర పోలీస్ క్రైమ్ బ్యూరో నివేదికల ప్రకారం గత ఏడాది తిరువనంతపురం జిల్లాలో మహిళలపై 1,773 నేరాలు జరిగాయి. ఇందులో 287 లైంగికదాడుల ఘటనలు కాగా, 772 వేధింపుల కేసులు, 40 ఈవ్‌టీజింగ్ కేసులు, 27 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షీ-కారిడార్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







