తమిళనాడుకు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల ...

- December 03, 2015 , by Maagulf
తమిళనాడుకు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల ...

అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా చెన్నై భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. వర్షాలకు ఛిన్నాభిన్నమైన చెన్నైతో పాటు పలు జిల్లాల్లో ఆయన గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడులో వర్ష బీభత్సాన్ని, ప్రజల ఇక్కట్లను ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఐఎన్‌ఎస్ అడయార్ నావెల్ బేస్‌లో ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ముందుగా తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ''మీకు మద్దతుగా ఉంటాను'' అంటూ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు చెప్పారు. ఇంతకు ముందు కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సాయం ప్రకటించిందని, ఇప్పుడు ప్రకటించిన మొత్తం దానికి అదనమని ఆయన తెలిపారు. తమిళనాడులోని దుర్భర పరిస్థితులను, జరిగిన నష్టాన్ని స్వయంగా చూశానని, ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్యతో సమావేశమైన ప్రధాని మోదీ రాష్ట్రంలో వరద బీభత్సంపై వారిని అడిగి తెలుసుకున్నారు. వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం వరద సాయంపై మోదీ ప్రకటన చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నైకి సమీపంలోని అరక్కోణంలోని ఐఎన్‌ఎస్ రాజాలి నావల్ వర్కింగ్ స్టేషన్‌కు చేరుకున్నారు. వరద సహాయ చర్యలు, తమిళనాడులో పరిస్థితులకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలైన చెన్నైతో పాటు కాంచీపురం, తిరువల్లురు జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళానాడు ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com