ప్రభాస్‌తో చేతులు కలిపిన ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌

- April 16, 2018 , by Maagulf
ప్రభాస్‌తో చేతులు కలిపిన ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'బాహుబలి' చిత్రంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. టాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ప్రభాస్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'సాహో' చిత్రం కూడా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ టీ సిరీస్‌ బ్యానర్‌పై సమర్పించనున్నారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రభాస్..భూషణ్‌ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌తో టీ సిరీస్‌ ఒప్పందం కుదుర్చుకుని 'సాహో' సినిమాను నిర్మిస్తున్నారు. సుజిత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ ఇందులో కథనాయికగా నటిస్తున్నారు.

నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత త్రయం శంకర్-ఎహసాన్‌-లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. 2017 ఆగస్ట్‌లో చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్‌, ముంబయి, అబు దాబి, దుబాయ్‌, రొమేనియా, యూరప్‌లలో చిత్రీకరణ జరుగుతోంది. హాలీవుడ్‌ నటుడు కెన్నీ బేట్స్‌ పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com