జీవనోపాధి నిమిత్తం ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్ళిన యువతికి అష్టకష్టాలు

- April 17, 2018 , by Maagulf
జీవనోపాధి నిమిత్తం ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్ళిన యువతికి అష్టకష్టాలు

భీమవరం:జీవనోపాధి నిమిత్తం ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్ళిన యువతికి అష్టకష్టాలు పడుతోంది. అక్కడ ఇంటి యజమాని రకరకాలుగా హింసించడమే కాకుండా రూమ్‌లో బంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా కొడుతూ ఉండడంతో ఆమె వాట్సప్‌ వీడియో కాల్‌ ద్వారా బహిర్గతం చేసింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వైరాల రాజు, మేరీలకు ఇద్దరు కుమారైలు. చిన్న కుమారై లావణ్యకు ఆకివీడుకు చెందిన బదానియేలుతో 2013లో వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం 2014లో లావణ్యకు బాగా పరిచయమైన మెంటేవారితోటకు చెందిన దుర్గతో తన గోడు విన్నవించుకుంది. గల్ఫ్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నఆమె కుమారుడు నాగరాజు ద్వారా కువైట్‌ వెళ్ళింది. సుమారు మూడేళ్లు అక్కడ పనిచేసిన లావణ్య తిరిగి భీమవరం వచ్చింది. మళ్ళీ అప్పు పెరిగిపోవడంతో సుమారు ఆరు నెలల క్రితం నాగరాజు, దుర్గ ద్వారా మళ్ళీ దుబాయ్‌ వెళ్లింది. అక్కడి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

దుబాయ్‌ నుంచి అక్కడి ఏజెంట్లు మళ్ళీ మస్కట్‌కు పంపించారు. మస్కట్‌ నుంచి హిమ్రత్‌  పంపించారు. హిమ్రత్‌లో ఆమె పనికోసం వెళ్ళిన యజమాని లావణ్యను చిత్రహింసలు పెట్టాడు. ఆమెను ఒక గదిలో బంధించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాడు. సీసీ కెమెరాల ఏర్పాటుతో తాను స్నానం చేయడానికి కూడా అవస్థలు పడవలసిన పరిస్థితి వస్తుందని లావణ్య యజమానికి చెప్పింది. అతను మరింత రెచ్చిపోయి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. బాధలు భరించలేని లావణ్య స్వదేశానికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ద్వారా వాట్సప్‌ వీడియో కాల్‌చేసి తెలిసిన వారికి పంపడంతో పట్టణంలో వ్యాపించింది.

మా కుమార్తెను స్వదేశానికి రప్పించండి

బతుకుతెరువు కోసం గల్ఫ్‌ వెళ్ళిన తమ కుమారైను స్వదేశానికి వచ్చేవిధంగా చూడాలని లావణ్య తల్లిదండ్రులు మేరీ, రాజు వేడుకొంటున్నారు. అనారోగ్యంగా ఉన్న తనను, సరిగా కళ్ళు కనపడని తండ్రిని చూసుకునేందుకు తన కుమారై గల్ఫ్‌ వెళ్ళిందని, అక్కడ చిత్రహింసలకు గురవుతుందని ఆమె వీడియోలో పెట్టడం ఎవరో చెప్పారన్నారు. లావణ్య క్షేమంగా స్వదేశానికి వస్తే చాలని ఆమె తల్లి వాపోయింది. దీనిపై పోలీసులకు విషయాన్ని తెలిపామని, వారు మూడు వారాల్లోగా మీ కుమారై ఇంటికి వస్తుందని చెప్పారన్నారు. వన్‌టౌన్‌ సీఐ కె.గోవిందరాజును వివరణ కోరగా ఏజెంట్లంతా గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారని, వారితో మాట్లాడవలసి ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com