స్మృతి ఇరానీ ఇస్తే తీసుకోం!

- May 03, 2018 , by Maagulf
స్మృతి ఇరానీ ఇస్తే తీసుకోం!

న్యూఢిల్లీ: నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులకు ఎంపికైన వాళ్లు ఆందోళన బాట పట్టారు. గురువారం సాయంత్రం అవార్డులు అందుకోవాల్సి ఉండగా.. ఆ సెర్మనీని బాయ్‌కాట్‌ చేస్తామంటూ హెచ్చరించారు. తమకు రాష్ట్రపతి ఎందుకు అవార్డులు ఇవ్వరు అంటూ వాళ్లు ప్రశ్నించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కేవలం 11 మందికే అవార్డులు ఇస్తారని, మిగతా వాటిని కేంద్ర సమాచారశాఖ మంత్రి స్మృతి ఇరానీ అందజేస్తారని చెప్పడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది తమను అవమానించడమే అవుతుందంటూ దేశవ్యాప్తంగా అవార్డుకు ఎంపికైన కళాకారులు రాష్ట్రపతి కార్యాలయంతోపాటు, సమాచార మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. రాష్ట్రపతి కేవలం 11 అవార్డులే అందజేస్తారని తమకు చివరి నిమిషంలో చెప్పడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని వాళ్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించే ఓ ప్రతిష్టాత్మక సంస్థ ముందుగానే ఇంత కీలక విషయాన్ని మాకు చెప్పకపోవడం ఓ నమ్మక ద్రోహంగా భావిస్తున్నామని మండిపడ్డారు. 65 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించడం నిజంగా దురదృష్టకరం అని ఆ లేఖలో ఆర్టిస్టులు ఘాటుగా స్పందించారు. దీనిపై ఇప్పటికే స్మృతి ఇరానీతో మాట్లాడినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సెర్మనీకి రాకుండా ఉండటం తప్ప మాకు మరో దారి లేదని, అవార్డుల సెర్మనీని బాయ్‌కాట్‌ చేసే ఉద్దేశం లేదు కానీ దానికి రాకుండా మా నిరసనను తెలుపుతున్నాం అని వాళ్లు ఆ లేఖలో స్పష్టంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com