మూడు సినిమాలకు ఓకే చేసిన వెంకీ

- June 05, 2018 , by Maagulf
మూడు సినిమాలకు ఓకే చేసిన వెంకీ

గురు తర్వాత కొత్త సినిమా విషయంలో కాస్త గ్యాప్‌ తీసుకున్నప్పటికీ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను లైన్‌లో పెడుతున్నారు విక్టరి వెంకటేష్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించే ఎఫ్‌ 2 చిత్రం ఈ నెలలోనే పట్టాలెక్కబోతున్నట్లు తెలిసింది. ఇందులో వరుణ్‌తేజ్‌ మరో కథానాయకుడిగా నటించనున్నారు. దీంతోపాటు మరో చిత్రానికి వెంకటేష్‌ పచ్చజెండా ఊపారు. బాబి (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఆయన నటించే ఆ చిత్రం జులైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్‌తో పాటు నాగచైతన్య నటించనున్నట్లు కొద్దిరోజులుగా వినిపిస్తోంది. దీనికి ఏం టైటిల్‌ పెడతారన్న అంశం ఆసక్తిగా మారిన నేపథ్యంలో వెంకీ మామ అనే పేరును పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల భోగట్టా. గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక కుటుంబ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. ఆ మేరకే ఆ టైటిల్‌ అయితే బావుంటుందన్న ఆలోచనలో చిత్రబృందం ఉందట. అయితీ ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అలాగే ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన బాలీవుడ్‌ నటి, కాలా ఫేమ్‌ హ్యూమాఖురేషిని, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేశారని వినిపిస్తోంది.

ఇదిలావుండగా.ఇంకోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కూడా వెంకీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. గతంలో నువ్వు నాకు నచ్చావ్‌, మల్లిశ్వరి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు త్రివిక్రమ్‌ రచన చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంకీ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చిత్రం రూపొందుతుందన్న మాట చాలాకాలంగా వినిపిస్తోంది. అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుందని.ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం ముహూర్తం జరుపుకుని.వచ్చే ఏడాదిలో రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకుంటుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com