సమయస్ఫూర్తి

- May 08, 2015 , by Maagulf
సమయస్ఫూర్తి

ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. తన కల్లబొల్లి మాటలతో అమాయక జంతువులను నమ్మించి వాటిని హాయిగా ఆరగించేసేది. ఒకరోజు ఏ జంతువూ కనిపించక ఆకలితో నకనకలాడసాగింది. ఆ సమయంలో అటుగా వస్తున్న కోళ్ళ గుంపు ఒకటి దాని కంటపడింది.వాటిని చూడగానే దానికి ప్రాణం లేచివచ్చినట్లయింది. కోళ్ళకు ఏమాత్రం అనుమానం రాకుండా మెల్లగా వెళ్లి ఆ గుంపులో కలిసిపోయింది. 'కొన్ని కోళ్ళను చంపి ఇప్పుడే తినేస్తాను, మరికొన్నింటిని దాచుకొని వారం రోజులు పండగ చేసుకుంటాను' అనుకుంటూ సంబరపడసాగింది. గుంపులో దూరిన నక్కను గమనించి కోళ్ళు ఇక తమ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయమనుకున్నాయి. అయితే రెండు ముసలికోళ్ళు మాత్రం నక్కను తరిమికొట్టడానికి చక్కని పధకం వేశాయి. దానిలో భాగంగా నక్కను సమీపించి...'నువ్వు మమ్మల్ని తినేస్తావని తెలుసు. అయితే మేము చచ్చిపోయేలోగా ఒకసారి దేవుడిని గట్టిగా ప్రార్ధించుకుంటాం, దయచేసి కాదనకు' అంటూ వేడుకున్నాయి. కోళ్ళు దేవుడిని వేడుకుంటే తనకు పోయేదేమీ లేదుకాబట్టి అలాగే ప్రార్ధించుకోమంది నక్క. అంతే, కొళ్ళన్నీ కలిసి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు బెదిరిపోతూ అరిచినట్టుగా గట్టిగా అరిచాయి. ఆ అరుపులు వినబడగానే పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న వాటి యజమానికి అవి ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టు అర్ధమై దుడ్డుకర్ర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చీ రావడంతోనే అవి అలా బెదిరిపోవడానికి కారణం గుంపులోని నక్క అని గ్రహించి దానికి గట్టిగా నాలుగు తగిలించాడు. ఆహారం సంగతి దేవుడెరుగు ప్రాణాలు దక్కినా చాలనుకొని నక్క అడివిలోకి పరుగు తీసింది. ఆపదలో చిక్కుకున్నప్పుడు కంగారుపడకుండా తెలివిగా కోళ్ళు ప్రదర్శించిన సమయస్ఫూర్తే వాటిని కాపాడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com