శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు యూకే వీసా నిబంధనలు సరళతరం

- July 07, 2018 , by Maagulf
శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు యూకే వీసా నిబంధనలు సరళతరం

లండన్‌ : భారత్‌తో పాటు విదేశీ శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు యూకే వీసా నిబంధనలను సరళతరం చేసింది. వీరి కోసం కొత్త రకం వీసాలను ప్రవేశపెట్టింది. ఆ దేశంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త రకం వీసాలను తీసుకొచ్చినట్టు యూకే పేర్కొంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైర్‌ 5 వీసా రూట్‌కి కొత్త యూకేఆర్‌ఐ సెన్స్‌, రీసెర్చ్‌, అకాడమియా స్కీమ్‌ను జతచేర్చుతున్నట్టు తెలిపింది. దీన్ని యూరోపియన్‌ యూనియన్‌ వెలుపల నుంచి యూకేకు రెండేళ్ల వరకు వచ్చే విద్యావేత్తలకు, శాస్త్రవేత్తలకు జూలై 6 నుంచి అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొంది.  పరిశోధన, నూతన ఆవిష్కరణలకు యూకే ప్రపంచ లీడర్‌గా ఉందని, యూకేలో పనిచేయడానికి, శిక్షణ తీసుకోవడానికి అంతర్జాతీయ పరిశోధకులకు ఈ వీసాలు ఎంతో ఉపయోగపడనున్నాయని యూకే ఇమ్మిగ్రేషన్‌ మంత్రి కారోలైన్‌ నోక్స్‌ తెలిపారు. ఈ వీసాలు యూకే వీసా నిబంధనలను సరళతరం చేస్తాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రతిభను ఆకట్టుకోవడానికి తప్పనిసరిగా మెరుగైన ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ను తాము కలిగి ఉండాలని పేర్కొన్నారు. వారి నైపుణ్యం నుంచి తాము ప్రయోజనం పొందనున్నామని చెప్పారు. యూకే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి, శాస్త్రవేత్తల, విద్యావేత్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, పరిశోధన ప్రతిభను ఆకట్టుకుంటూ... యూకేను ప్రపంచంలో అగ్రగామిగా ఉంచుతామన్నారు. ఈ స్కీమ్‌ను యూకే పరిశోధన, నూతనావిష్కరణ సంస్థ‌(యూకేఆర్‌ఐ) నిర్వహిస్తుంది. ఇది దేశీయంగా ఉన్న ఏడు రీసెర్చ్‌ కౌన్సిల్స్‌ను ఒక్క తాటిపైకి చేరుస్తుంది. యూకేఆర్‌ఐ, దాంతో పాటు 12 ఆమోదిత పరిశోధన సంస్థలు ఇక నుంచి ప్రత్యక్షంగా అత్యంత నిపుణులైన ప్రజలకు స్పాన్సర్‌ చేయడానికి వీలవుతుంది. వారికి యూకేలో శిక్షణ ఇచ్చేందుకు, పని చేసేందుకు ఈ కొత్త వీసాలు ఎంతో సహకరించనున్నాయని యూకేఆర్‌ఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొఫెసర్‌ మార్క్‌ వాల్‌పోర్ట్‌ చెప్పారు. స్పాన్సర్‌ ఆర్గనైజేషన్లను కూడా యూకేఆర్‌ఐనే నిర్వహిస్తోంది. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com