సింగ‌పూర్‌లో చంద్రబాబు... 30 వేల కోట్ల విలువైన..

- July 08, 2018 , by Maagulf
సింగ‌పూర్‌లో చంద్రబాబు... 30 వేల కోట్ల విలువైన..

అమరావతిని ఆర్థికాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో సమ్మిళిత వృద్ధి  సాధించాలన్నదే తమ ప్రయత్నమన్నారు. అమరావతి, ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి పెట్టుబడులు, సాంకేతిక సహకారాల కోసం సింగపూర్‌ వెళ్లిన చంద్రబాబు.. అక్కడి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సింగపూర్‌ జాతీయాభివృద్ధి మంత్రి లారెన్స్‌ వోంగ్‌తో భేటీ అయ్యారు.

ఏపీకి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగ‌పూర్ పర్యటన కొనసాగుతోంది. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలపడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. సింగపూర్‌ పర్యటనలో పలువురు ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. రాజధానిలో 30 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 30 వేల కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియను చేపట్టామని వివరించారు. అమరావతి ప్రజారాజధానిగా ఉంటుందని ప్రపంచ దేశాల ప్రతినిధులకు స్పష్టం చేశారు. అమరావతి సమీపంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన రెండు పెద్ద నగరాలున్నాయన్నారు. అమరావతిని ద‌శ‌ల‌వారీగా  అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

ఇష్టం లేని విభజన ఎదుర్కొని కసిగా అభివృద్ధి చెందిన సింగపూర్ తమకు ఆదర్శమన్నారు చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను రికార్డు సమయంలో అందజేసిన సింగపూర్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 40 నుంచి 50 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. అమ‌రావ‌తి అభివృద్ధిలో భాగం కావాల‌ని వారికి పిలుపునిచ్చారు చంద్రబాబు.

అంతకు ముందు సింగపూర్ నేషనల్ డెవలప్‌మెంట్‌ మినిష్టర్ లారెన్స్  వొంగ్‌తో భేటీ సందర్భంగా.. రాజధాని నిర్మాణానికి అవసరమైన సాకేంతిక పరిజ్ఞానంపై చర్చించారు. రెండు దేశాల పరస్పర సహకార సంబంధాలకు ఇదొక మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రణాలికలు తననెంతో ఆకట్టుకున్నాయని వోంగ్‌ కితాబిచ్చారు. ప్రణాళికా బద్దంగా గ్రీన్‌ఫీల్డ్ సిటీ  అభివృద్ధి జరిగితే అది ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ఇటీవల సింగపూర్‌ మంత్రులు పలువురు భారత్‌ సందర్శించిన సమయంలో అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తంచేశారని వోంగ్‌ గుర్తు చేశారు. ఇంత మొత్తంలో రైతులు భూములు ఇవ్వడం అపూర్వ విషయమన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం అందరికీ మార్గదర్శకంగా అభివర్ణించారు. అమరావతి నిర్మాణంలో నవీన సాంకేతికత, వినూత్న విధానాల అమలుకు తాము తప్పక సహకరిస్తామని వోంగ్‌ చెప్పారు. హరిత నగరంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వామ్యం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న గ్లోబ‌ల్ సిటీస్ స‌మ్మిట్ ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలపై అందరిలో అవగాహన పెంచేందుకు దోహదపడుతుందన్నారు. అనేక వినూత్న పెట్టుబడి భాగస్వామ్యాలకు ఈ సదస్సు వేదికగా నిలవబోతోందని చెప్పారు. ఇతర దేశాలతో సింగపూర్ సంబంధాలన్నీ నిర్ణీత పద్ధతిలో వుంటాయన్నారు. అయితే  భారతదేశం విషయానికి వస్తే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సహకారం అందిస్తున్నామని, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో తమ సంబంధాలు దృఢంగా ఉంటాయని, తాము త్వరలో భారత్ వచ్చినప్పుడు అమరావతిని తప్పక సందర్శిస్తామని  వొంగ్‌  వివరించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com