ఇకపై ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొనాలన్నా ఆఫర్లు ఉండవు..

- August 01, 2018 , by Maagulf
ఇకపై ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొనాలన్నా ఆఫర్లు ఉండవు..

మొబైల్ కొనాలంటే ఆన్‌లైన్‌.. టీవీ కొనాలంటే ఆన్‌లైన్‌.. వస్తువు ఏదైనా.. కొనుగోలు చేసేది ఆన్‌లైన్‌ లోనే. పైగా ఏఏ విక్రయ సంస్థలు ఎంతెంత ఆఫర్లు ఇస్తున్నాయో వెతికి మరీ వస్తువు కొనేస్తారు.. ఇకపై అలా కుదరదు. ఆఫర్ల రూపంలో ధరలు తగ్గించి విక్రయించడంపై నియంత్రణ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని ఇ-కామర్స్‌ రంగ విధాన ముసాయిదాలో ప్రతిపాదించారు. త్వరలోనే ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలతో పాటు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహార సరఫరా వెబ్‌సైట్‌లు, పేటీఎం, పాలసీ బజార్‌లాంటి ఆర్థిక సేవలు అందించే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తున్నారు.

బీ2సీ ఇ-కామర్స్‌ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితి 49 శాతంగా ఉంది. ఇక బీ2బీ ఇ-కామర్స్‌ వ్యాపరంలో ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతి ఉంది. అయితే ఈ నిబంధనల వల్ల ప్రస్తుతం దిగ్గజ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలన్నీ కూడా బీ2బీ కిందకు వస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫాంపై విక్రయదార్లు వస్తువులును అమ్ముకునేందుకు వీలు కల్పించి అందుకు ప్రతిగా ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు కమీషన్‌ను పొందుతున్నాయి.

పైగా వస్తువుల నిల్వ కోసం కొన్ని అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా కొన్ని సమయాల్లో థర్డ్‌ పార్టీ విక్రయదార్లుగా మారుతున్నాయి(క్వికర్). తద్వారా ఇచ్చిన పరిమితుల్లో కాకుండా కొన్ని లొసుగులను వాడుకుంటు.. ఎడా పెడా ఆఫర్లు ప్రకటించి విపరీతమైన కమిషన్లు పొందుతున్నాయి.. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని నిపుణుల కమిటీ ముసాయిదాలో ప్రతిపాదించింది. దాంతో ముసాయిదాను ఆమోదిస్తే విక్రయ సంస్థలు ఇచ్చే ఆఫర్లకు గండిపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com