కేరళ:భారీ వరదలు.. 27 మంది మృతి...

- August 10, 2018 , by Maagulf
కేరళ:భారీ వరదలు.. 27 మంది మృతి...

కేరళ:లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లు తెగిపోతున్నాయి. గ్రామాలు సరస్సులుగా మారిపోయాయి. తాగడానికి నీరు లేదు. ఉండడానికి గూడు లేదు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వర్షాల ధాటికి కేరళలోని పలు జిల్లాల్లో తాజా పరిస్థితి ఇది. వరదల కారణంగా ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయలయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో కొచ్చి విమానాశ్రయంలో విమానరాకపోకలు నిలిచిపోయాయి.

కేరళ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 24 డ్యామ్ ల గేట్లను ఒకేరోజు ఎత్తి నీటిని కిందకు వదిలారు. వరద ఉధృతి దాదాపు ఆరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆసియాలోనే అతిపెద్ద డ్యాముగా పేరొందిన ఇరుక్కుడి చెరుతోని డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి గేట్లు ఎత్తారు. ఇడుక్కి, కోజీకోడ్, వయనాడ్, మలప్పురం, ఎర్నాకులంలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసింది…

వరదల ప్రభావంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు వరదలపై ముఖ్యమంత్రి విజయన్‌ మాట్లాడుతూ కేరళ చరిత్రలోనే తొలిసారిగా 24 డ్యాముల గేట్లను ఎత్తాల్సి వచ్చిందని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని స్పష్టం చేశారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సెక్రటేరియట్‌లో 24 గంటలు పనిచేసే ఉచిత టోల్‌ ఫ్రీ నెంబర్‌ను.. పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎత్తైన ప్రాంతాలు, ఆనకట్టల సందర్శనకు వెళ్లవద్దని పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రానికి సహకరించేందుకు సిద్ధమని చెప్పారు.

మరోవైపు పల్లివాసల్ వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో 60 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు సమాచారం. దాంట్లో 20 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. గత రెండు రోజులుగా టూరిస్టులు ఆ రిసార్ట్‌లోనే తలదాచుకున్నారు.. వారిని NDRF బృందాలు పునరావాస కేంద్రాలకు తరలించారు. కేరళకు వెళ్లవద్దు అంటూ అమెరికా తమ టూరిస్టులకు ఆదేశాలు జారీ చేసింది. కేర‌ళ‌లో నీట మునిగిన ప్రాంతాల‌ను ఆదివారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్నారు.

కేరళలోని నదులు ఉప్పొంగడంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను సైతం కేంద్రం అప్రమత్తం చేసింది. కేరళకు తమిళనాడు ప్రభుత్వం 5 కోట్ల విరాళం ప్రకటించింది. అటు బాధితులను ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. రూ. 10 కోట్లు విలువైన ఆహారపదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, అవసరమైన నిత్యావసర వస్తువులు కేరళకు పంపిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com