ఆసియాక్రీడలకు సిద్దమైన ఇండోనేషియా

- August 17, 2018 , by Maagulf
ఆసియాక్రీడలకు సిద్దమైన ఇండోనేషియా

కామన్‌వెల్త్‌గేమ్స్ తర్వాత అతిపెద్ద క్రీడాసంబరం ఆసియాక్రీడలకు ఇండోనేషియా సిధ్ధమైంది. జకార్తా, పాలెంబ్యాంగ్ వేదికలుగా 15 రోజుల పాటు ఈ క్రీడాసంబరం అభిమానులను అలరించనుంది. ఇవాళ ఆరంభ వేడుకలు జరగనుండగా… ఆదివారం నుండి ప్రధాన పోటీలు ఆరంభం కానున్నాయి. 45 దేశాలకు చెందిన 10వేలకు పైగా అథ్లెట్లు 58 ఈవెంట్లలో పోటీ పడనున్నారు. భారత్‌ నుంచి 572 మంది అథ్లెట్లు బరిలో ఉండగా… 36 క్రీడల్లో పోటీపడనున్నారు. గత ఎడిషన్‌లో 57 పతకాలు గెలుచుకున్న భారత్‌ ఖాతాలో 11 స్వర్ణాలు, 10 రజతాలున్నాయి. అయితే ఈ సారి పతకాల సంఖ్య పెంచుకునే అవకాశాలున్నాయి. బాక్సింగ్, బ్యాడ్మింటన్ , టీటీ , హాకీ, కబడ్డీతో పాటు ట్రాక్ ఈవెండ్స్‌లోనూ పతకాలపై ఆశలున్నాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌ జట్టుపై భారీ అంచనాలున్నాయి. గత ఏడాది కాలంగా మేజర్ టోర్నీలో నిలకడగా రాణిస్తోన్న సింధు, సైనాతో పాటు డబుల్స్‌ విభాగంలోనూ పతకాలు ఖాయమని అంచనా.

అటు ప్రతీ ఎడిషన్‌లోనూ స్వర్ణం కైవసం చేసుకుంటోన్న భారత కబడ్డీ జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అటు హాకీలోనూ మన జట్లపై అంచనాలు పెట్టుకోవచ్చు. ఇక బాక్సింగ్, రెజ్లింగ్‌తో పాటు టేబుల్ టెన్నిస్‌, ట్రాక్ ఈవెంట్స్‌లోనూ పతకాలు ఖాయంగా చెప్పొచ్చు. అయితే టెన్నిస్‌లో సీనియర్ ప్లేయర్ లియాండర్ పేస్ తప్పుకోవడంతో మన క్రీడాకారులు ఎంతవరకూ రాణిస్తారనే ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఎప్పటిలానే చైనా బలమైన జట్టుగా బరిలోకి దిగుతోంది. స్వర్ణాల వేటలో ఈసారి డబుల్ సెంచరీ కొట్టాలనుకుంటోన్న చైనాకు సౌత్‌కొరియా, జపాన్, ఇరాన్‌ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. సెప్టెంబర్ 2 వరకూ జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఏ మేర సత్తా చాటుతుందో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com