సౌదీ అరేబియా:కార్లలో దూసుకుపోతున్న మహిళలు

- August 29, 2018 , by Maagulf
సౌదీ అరేబియా:కార్లలో దూసుకుపోతున్న మహిళలు

రియాద్‌: కొద్ది నెలల క్రితం వరకూ కలగానే మిగిలిన కారు డ్రైవింగ్‌ చక్రం ఇప్పుడు చేతుల్లోకి రావటంతో సౌదీ మహిళలు కార్లలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ప్రపంచంలో మహిళల కారు డ్రైవింగ్‌పై నిషేధం ఉన్న ఏకైక దేశం సౌదీ అరేబియాలో యువరాజు మహ్మద్‌ బీన్‌ సల్మాన్‌ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా గత జూన్‌లో మహిళలను కారు డ్రైవింగ్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. తమకు కారు రేసుల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించాలని మహిళలు సౌదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం డ్రైవింగ్‌కు అనుమతించిన ఉత్సాహంతో ఇప్పుడు మహిళలు తమ కార్లతో విన్యాసాలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. అయితే, ప్రజల భద్రత దృష్ట్యా కార్‌ డ్రైవింగ్‌లో వేగ పరిమితులు విధించింది. అయితే గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన స్పీడ్‌ డ్రైవింగ్‌ను ఇప్పుడు తమకు అనుమతించాలని మహిళలు కోరుతున్నారు. మహిళలకు కారు డ్రైవింగ్‌కు ప్రభుత్వం అనుమతించటంతో కార్ల షోరూమ్‌లు మహిళలను ఆకర్షించేందుకు అనేక రకాలు, రంగుల కార్లను అమ్మకానికి సిద్ధం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, మహిళలను కారు రేసింగ్‌లకు అనుమతించటానికి ముందు రేసింగ్‌ సిమ్యులేటర్ల ద్వారా వారికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాగా కారు డ్రైవింగ్‌ శిక్షణా కార్యక్రమాలు అధిక వ్యయభరితంగా ఉన్నాయని, పురుషుల నుండి వసూలు చేసే ఫీజు కన్నా మహిళల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.మహిళలకు డ్రైవింగ్‌ నేర్పేందుకు మహిళా ఇన్‌స్ట్రక్టర్ల కొరత కూడా తీవ్రంగా ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com