రివ్యూ: @నర్తనశాల
- August 30, 2018
సినిమా పేరు: @నర్తనశాల
నటీనటులు: నాగశౌర్య, కశ్మీరా, యామిని భాస్కర్, జయప్రకాశ్ రెడ్డి, శివాజీ రాజా, అజయ్, సత్యం రాజేశ్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్
నిర్మాతలు: ఉషా ముల్పూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి
విడుదల తేదీ: 30-08-2018
తొలి నుంచీ విభిన్నమైన కథలను ఎంపికచేసుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఇప్పటి వరకు లవర్‌బాయ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగశౌర్య తొలిసారి గే పాత్రను ఎంచుకోవడం విశేషం. సాధారణంగా ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవడానికి చాలా మంది సంకోచిస్తారు. కానీ, నాగశౌర్య దీన్ని ఓ సవాలుగా తీసుకున్నారు. అలనాటి సినిమా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. ఈ సినిమాతో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడా? గే పాత్రలో ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించాడు? చూద్దాం..
కథేంటంటే: కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా) అమ్మ చనిపోతుంది. దాంతో తనకు కూతురు పుడితే ఆమెను అమ్మగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ, అబ్బాయి (నాగశౌర్య. సినిమాలో అతని పాత్రకు పేరు లేదు) పుడతాడు. కూతురు పుట్టాలన్న తన ఆశ నెరవేరకపోవడంతో కొడుకునే ఆడపిల్లలా పెంచుతాడు కల్యాణ్. పెద్దయ్యాక నాగశౌర్య మహిళల కోసం ఒక ఇన్స్టిట్యూట్ పెడతాడు. ఆ సమయంలో మానస(కశ్మీరా)ను చూసి ఇష్టపడతాడు. అదే సమయంలో జయప్రకాశ్ రెడ్డి కుమార్తె సత్య(యామిని భాస్కర్) తనను నాగశౌర్య ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది. నాగశౌర్య తండ్రి కల్యాణ్ కూడా అదే అనుకుంటాడు. నిజానిజాలు తెలుసుకోకుండా కల్యాణ్.. జయప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడతాడు. ఇందుకు జయప్రకాశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ, తాను మనసారా ప్రేమించిన మానసను మర్చిపోలేక పెళ్లి నుంచి తప్పించుకోవడానికి తాను అసలు ఏ అమ్మాయినీ ప్రేమించలేనని, తానో 'గే'నని చెప్తాడు నాగశౌర్య. ఆ అబద్ధం వల్ల అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఈ ప్రేమ కథ ఎక్కడ ముగుస్తుంది? అన్నదే కథ.
ఎలా ఉందంటే: అసలు ఇలాంటి కథలు ఇంతకుముందు తెలుగులో రాలేదు. ఒక హీరో గే పాత్రలో నటించడం అరుదైన విషయం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ నటించిన 'దోస్తానా' సినిమా వచ్చిన తర్వాత ఆ తరహా కథలో చేద్దామని పలువురు తెలుగు దర్శకులూ ప్రయత్నించారు. కానీ, ఏ ఒక్కరూ ఆ పాత్రలో నటించేందుకు ధైర్యం చేయలేదు. నాగశౌర్య మాత్రం దానిని సవాలుగా తీసుకున్నాడు. '@నర్తనశాల' సినిమాలో తొలి సగభాగం అంతా హీరో పాత్ర, శివాజీ రాజా చేసే పొరపాట్లు, వాటి నుంచి పండే కామెడీ, సత్యం రాజేశ్ ఎపిసోడ్, హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీపై నడిపించాడు దర్శకుడు. గే ఎపిసోడ్ అంతా ద్వితీయార్ధానికి కేటాయించుకున్నారు. అజయ్ పాత్ర రావడమే ఈ కథకు మలుపు. గే పాత్రకు సంబంధించిన ఎపిసోడ్లన్నీ బాగా పేలాయి. అలాంటి సన్నివేశాలు చూడటం కొత్త కాబట్టి ప్రేక్షకులు వాటిని బాగానే ఆస్వాదిస్తారు. కథలో వినోదాన్ని పండించే స్కోప్ ఉంది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్నీ నవ్వించేలానే చేశాడు.
కాకపోతే ఆ నవ్వులూ వినోదమూ అంతా పైపైనే ఉంటుంది. నాన్‌స్టాప్‌గా నవ్వించే ఎపిసోడ్లు ఒకటి, రెండుంటాయి. అవి కూడా ద్వితీయార్ధంలోనే. అజయ్, నాగశౌర్య మధ్య సన్నివేశాలు వర్కవుట్ అయ్యాయి. అదే స్థాయిలో మిగిలిన సన్నివేశాలు కూడా ఉండుంటే '@నర్తనశాల' కచ్చితంగా గుర్తుండిపోయే చిత్రం అయ్యేది. ద్వితీయార్ధం మొత్తం అజయ్ ఇంటికే పరిమితం చేయడం, ఒక కథానాయికను గదిలో బంధించడం, రెండో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోవడం, అక్కడక్కడా నటీనటుల ఓవర్ యాక్షన్ కథాగమనాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. కథలో, సన్నివేశాల్లో పెద్దగా మలుపులేమీ ఉండవు. సినిమా అంతా ప్రేక్షకుడి ఆలోచనకు అనుగుణంగానే సాగుతుంటుంది. పతాక సన్నివేశాలు సైతం రొటీన్‌గా అనిపించాయి.
ఎవరెలా చేశారంటే: ఇలాంటి పాత్రను ఒప్పుకోవడంతోనే సగం మార్కులు కొట్టేశాడు నాగశౌర్య. అతని ప్రతిభ అంతా గే సన్నివేశాల్లో చూపించగలిగాడు. నాగశౌర్య సిగ్గుపడే సన్నివేశాలు చాలా సరదాగా అనిపిస్తాయి. ఇద్దరు కథానాయికలు ఉన్నా వారి పాత్రలు అంతంత మాత్రమే. కేవలం పాటలకు పరిమితమయ్యారు. అజయ్ నటన నచ్చుతుంది. ద్వితీయార్ధంలో కామెడీ వర్కవుట్ అయ్యిందంటే దానికి కారణం అజయ్ పాత్రే. జయప్రకాశ్ రెడ్డి, శివాజీ రాజావి నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలు. కాకపోతే అక్కడక్కడా వారి నటన శ్రుతి మించినట్లు అనిపిస్తుంది. సత్యం రాజేశ్ కాసేపు నవ్విస్తాడు. ఐరా సంస్థ నిర్మించిన రెండో చిత్రం ఇది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రంగుల హరివిల్లుగా పాటల్ని తీర్చిదిద్దారు. సినిమా రిచ్‌గా ఉంటుంది. రెండు, మూడు పాటలు వినడానికి, చూడ్డానికి కూడా బాగున్నాయి. దర్శకుడు రాసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని ఇంకాస్త బాగా డీల్ చేయొచ్చు అనిపిస్తుంది. వినోద ప్రధానమైన చిత్రమిది. అయితే, ఆ సన్నివేశాలు అక్కడక్కడ మాత్రమే మెరిశాయి.
బలాలు:
+ సినిమాలో పాయింట్
+ నాగశౌర్య, అజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు
+ పాటలు
+ నిర్మాణ విలువలు
బలహీనతలు:
- నటీనటుల ఓవర్‌యాక్షన్
- అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు
చివరగా: '@నర్తనశాల' ఓ నవ్వించే ప్రయత్నం!
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి