ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా వేగంగా అడుగులు

- August 31, 2018 , by Maagulf
ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా వేగంగా అడుగులు

ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు చేసే విషయంపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విభజన సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు. ప్రస్తుత భవనంలోనైనా లేదా వేరొకచోట అయినా తమకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇప్పుడున్న భవనం ఏపీకి ఇచ్చేందుకు తాము సిద్ధమని కూడా ప్రభుత్వం తరపున చెప్పుకొచ్చారు. ప్రస్తుతమున్న హైకోర్టు భవనంలో 24 హాల్స్ ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఇదే విషయంపై కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంను కోరారు. 2015 మే 1వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరింది. కేంద్రం వాదనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు. తెలంగాణకు ప్రత్యేకంగా గచ్చిబౌలిలో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే అక్కడకు వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ భవనాలు, ఇతరత్రా పంపకాలు కూడా పూర్తయ్యాయని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు ముకుల్ రోహత్గీ. ఉద్యోగుల విభజన వంటివి కూడా పూర్తయిన నేపథ్యంలో.. న్యాయ వ్యవస్థ విభజనకు ఆటంకాలు ఉండబోవని అన్నారు. తమ రెండు ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో.. ఏపీ ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. హైకోర్టు విభజనపై వైఖరిని లిఖిత పూర్వకంగా తెలియచేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com