తెలంగాణ:ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధం

- September 01, 2018 , by Maagulf
తెలంగాణ:ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధం

తెలంగాణ:ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. కొంగరకొలాన్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న సభకు మెదక్ జిల్లా నుంచి వేలాది వాహనాలు బయలుదేరాయి. ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా తండోపతండాలుగా వివిధ వర్గాల ప్రజలు తరలివస్తున్నారు. అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని సభకు బయలుదేరారు. గులాబీ వాహన శ్రేణిని మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడిపి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో రెండువేల ట్రాక్టర్లలో రైతులు సభ ప్రాంగణానికి బయలుదేరారు. శ్రీశ్రీసర్కిల్ వద్ద ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ట్రాక్టర్లను బహిరంగసభకు సాగనంపారు. తరువాత ప్రగతి నివేదన సభకు సన్నాహకంగా ఖమ్మంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మంత్రి తుమ్మల బైక్ నడిపి కేడర్‌లో జోష్ నింపారు. సీఎం కేసీఆర్ నాలుగేండ్లలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల అన్నదాతలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారని తుమ్మల తెలిపారు.

ఖమ్మం నుంచి ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో 2 వేల ట్రాక్టర్లలో బయల్దేరిన ర్యాలీకి.. సూర్యాపేట్‌లో మంత్రి జగదీశ్‌ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్‌ దిశగా రైతులు ట్రాక్టర్లలో ప్రయాణం సాగిస్తున్నారు. KCR సభకు ట్రాక్టర్లలో జనం వస్తున్నారంటే.. వారికి ముఖ్యమంత్రిపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు.


 
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు దాదాపు మూడు లక్షల మంది తరలివెళ్లారు. ఒక్కో నియోజకవర్గానికి వందకు తగ్గకుండా ట్రాక్టర్లను, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సభకు బయల్దేరిన రెండు వందల ట్రాక్టర్ల ర్యాలీని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రతిపక్షాలు ఆత్మ విశ్వాసాన్ని కొల్పోయి..తమ ఉనికిని చాటుకునేందుకే విమర్శలు చేస్తున్నాయని మండిప్డడారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. ట్రాక్టర్ల ర్యాలీని నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ప్రగతి నివేదన సభకు ప్రజలు స్వచ్చందంగా తరలివస్తున్నారని, దాదాపు 25వేల పైగా జిల్లా నుంచి హాజరుకానున్నట్లు మంత్రి ఈటెల చెప్పారు. మరోవైపు సిరిసిల్ల నుంచి బయల్దేరిన 150 ట్రాక్టర్ల ర్యాలీని ఎంపీ వినోద్ ప్రారంభించారు. సిరిసిల్ల నుంచి బయల్దేరిన ఈ ర్యాలీ.. మార్గమధ్యలో ప్రజలకు ప్రగతి నివేదన సభ గురించి అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం వరకు సభా ప్రాంగణానికి చేరనుంది.

అటు నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రాక్టర్లపై బయలుదేరి వస్తున్నారు. బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపి ర్యాలీ ప్రారంభించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని వాహనాలను తెప్పించినట్టు మంత్రి పోచారం తెలిపారు.


 
ఆర్మూర్ నుంచి ప్రగతి నివేదన సభకు బయల్దేరిన ట్రాక్టర్ ర్యాలీని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలతో బయలుదేరారు. నియోజకవర్గం నుంచి 25 వేల మందిని తరలిస్తున్నామని జీవన్ రెడ్డి చెప్పారు.

నల్గొండ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ప్రగతి నివేదన సభకు క్యూ కట్టింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి మూడు లక్షల మంది.. ఈ సభకు తరలివస్తున్నారని అంచనా. టీఆర్‌ఎస్‌ శ్రేణుల రాకతో హైదరాబాద్‌-విజయవాడ రహదారి సందడిగా మారిపోయింది. మరోవైపు ప్రగతి నివేదన సభ విజయవంతం కావాలని కోరుతూ ఎల్బీనగర్ లో గులాబీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్బీనగర్ టీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో చైతన్యపురి నుంచి హయత్ నగర్ వరకు సన్నాహక స్పూర్తి ర్యాలీ నిరవహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com