హైదరాబాద్ నిజాం మ్యూజియంలో దొంగతనం చేసిందెవరు?
- September 03, 2018
హైదరాబాద్:హైదరాబాద్ నిజాం మ్యూజియంలో దొంగతనం చేసిందెవరు? చీమ చిటుక్కుమన్నా కనిపెట్టగలిగే టైట్ సెక్యూరిటీ ఉన్నచోట నుంచి విలువైన వస్తువులు దోచుకెళ్లిందెవరు? ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. అత్యంత విలువైన పురాతన వస్తువులను దోచుకెళ్లడం కలకలం రేపింది. హైదరాబాద్ నడిబొడ్డునే ఇలా జరగడం వెనుక సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుండడంతో.. కేసు ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు.
డబీర్‌పురాలో ఉన్న ఈ మ్యూజియంలో నిజాం నవాబుల కాలంనాటి అత్యంత విలువైన, పురాతన వస్తువులను భద్రపరిచారు. రోజూ వేలాది మంది ఈ మ్యూజియంను సందర్శిస్తారు. ఇందులో ఉండే వస్తువులను చూసి వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. నిజాం నవాబు వాడిన వస్తువుల్లో వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, గోల్డెన్ స్పూన్, బంగారు కప్పు, సాసర్లు ఉన్నాయి. వీటిని టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఖరీదైన నాలుగు వస్తువులు చోరీకి గురవడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు… క్లూస్ టీంలతో ఆధారాల కోసం వెదికారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నిన్న మ్యూజియంకి వెళ్లి.. చోరీ ఎలా జరిగిందో ఆరా తీశారు. దాదాపు 2 గంటలపాటు అక్కడే ఉండి, క్లూస్ టీమ్‌తో కలిసి దర్యాప్తు చేశారు. డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులను కూడా రంగంలోకి దించి మ్యూజియంలో అణువణువూ శోధించారు. మొత్తం కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఇంటి దొంగల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.
నిజాం మ్యూజియంలో ఉన్న సంపద విలువ వేల కోట్లు ఉంటుంది. ఎన్నో పురాతన కళాఖండాలు, చారిత్రక నేపథ్యం ఉన్న వస్తువులు ఇక్కడ భద్రపరిచారు. ఐతే.. ఇక్కడ సెక్యూరిటీ పర్యవేక్షణ బాధ్యతలు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. పగలు ముగ్గురు, రాత్రి ఐదుగురు ఇక్కడ డ్యూటీలో ఉంటారు. ఇంత కీలకమైన చోట సరైన నిఘా కెమెరాలు లేకపోవడం వల్ల ఇప్పుడు చోరీ జరిగినా దొంగలను గుర్తించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతానికి మ్యూజియంకి వచ్చే మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్పైనే ఆధారపడి దొంగలు ఎటు వెళ్లారో గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది.
నిజాం మ్యూజియంలో దొంగతనానికి గురైన వస్తువుల విలువ ఎంత ఉంటుంది అన్న దానిపై లెక్క తీస్తున్నారు. ముందసలు దొంగలు లోపలికి ఎలా ప్రవేశించారు అన్నది తేల్చేపనిలో ఉన్నారు. ఈ మ్యూజియం ముందు, వెనుక ఇళ్లు ఉన్నాయి. రావడానికి ఒకే దారి ఉంది. ఇలాంటి చోటకు దర్జాగా వచ్చి ఎలా వస్తువులు ఎత్తుకెళ్లారన్నది అంతు చిక్కడం లేదు. నిజాం సంస్థానంలో ఆఖరువాడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కి సంబంధించిన వస్తువులు, ఆయనకు కానుకలుగా వచ్చిన వాటిని ఈ మ్యూజియంలో భద్రపరిచారు. 1937లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాతికేళ్ల పాలన పూర్తైన సందర్భంగా.. సిల్వర్ జూబ్లీ వేడుకలు చేశారు. ఆ సందర్భంగా పలువురు రాజులు, బ్రిటీషర్లు ఇచ్చిన కానుకలను ఈ భవనంలో ప్రత్యేకంగా దాచి ఉంచారు. నిజాం జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మ్యూజియాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న చోట నుంచి నాలుగు వస్తువులు చోరీ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి