తెలంగాణ:అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు

- September 05, 2018 , by Maagulf
తెలంగాణ:అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు

తెలంగాణ:తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ్టితో అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసి రేపు ఉదయాన్నే కీలక నిర్ణయం తీసుకునేలా KCR చకచకా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం గురువారం ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ నిర్వహించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా అనుకున్న ముహూర్తానికి అసెంబ్లీ రద్దు తీర్మానంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం కేబినెట్ భేటీ తర్వాత మంత్రివర్గ ఆమోదంతో ఆ తీర్మానం ప్రతిని గవర్నర్‌కు అందిస్తారు. గవర్నర్ దాన్ని ఎప్పటిలోగా ఆమోదిస్తారు.. తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై కూడా తొందరగానే క్లారిటీ వచ్చేస్తుంది.

అసెంబ్లీ రద్దుకు ఏకవాక్య తీర్మానం చేసి దాన్నే గవర్నర్‌కు అందించబోతున్నారు KCR. గతంలో అసెంబ్లీ రద్దు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కారణాలు చూపించారన్నది కూడా ఓసారి పరిశీలించారు. న్యాయపరమైన చిక్కులేమీ లేకుండా ఇప్పటికే ఒకటికి రెండుసార్లు రాజ్యాంగ నిపుణులతో చర్చలు కూడా జరిపారు. ఎన్నికలు డిసెంబర్‌లో పూర్తి చేసి డిసెంబర్ 15కల్లా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలన్నది KCR ఆలోచన. దీనికి తగ్గట్టే వేగంగా పావులు కదుపుతున్నారు. ఇవాళ ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మను డిల్లీ పంపిస్తున్నారు. CEC అధికారులతో మాట్లాడడం ద్వారా.. అట్నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక, పాలనా పరంగా ఇవాళే దాదాపు ఆఖరు రోజు అవుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల బదిలీలు, కీలకమైన వారికి ముఖ్య బాధ్యతల అప్పగింతలు వంటివన్నీ ఇలాళే పూర్తి చేసేస్తారు. రాత్రి పొద్దుపోయే వరకూ విధానపరమైన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. కొన్ని పెండింగ్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఇవాళ జిల్లాల్లో బాగానే జరగబోతున్నాయి.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ నిన్ననే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషితో సమావేశమయ్యారు. ఇక ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. రేపు అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేసిన వెంటనే దానికి గవర్నర్‌ ఆమోదం తెలపడం , కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం లాంటివన్నీ చకచకా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ తన భుజస్కందాలపై వేసుకోబోతున్నారు. 50 రోజుల్లో 100 బహిరంగసభల్లో కేసీఆర్‌ పాల్గొనేలా TRS ప్లాన్ రెడీ చేసుకుంటే.. 10వ తేదీలోగా నియోజకవర్గ సభలను పెట్టాలని కాంగ్రెస్‌ లెక్కలేస్తోంది. 12వ తేదీన పాలమూరు నుంచి ఎన్నిల శంఖారావం పూరించేందుకు అమిత్‌షా కూడా సిద్ధమయ్యారు. ఈనెల 8వ తేదీన చంద్రబాబుతో భేటీ తర్వాత తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. జనసేనతో కలిసి పోరుకు సమాయత్తమవుతున్న సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌ కూడా ఈసారి సత్తా చాటుతామంటోంది. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పొత్తులపై కసరత్తులు ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com