పాక్‌తో మరో మ్యాచ్ కి సిద్ధమవుతున్న భారత్.!
- September 22, 2018
దుబాయ్ : సూపర్-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు ఓడించిన టీమిండియా ఆదివారం దాయాది పాకిస్తాన్ భరతం పట్టేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలిపోరులో భారత్ పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. హాంకాంగ్‌తో తొలిమ్యాచ్ మినహా ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు ప్రదర్శన అప్రతిహాతంగా కొనసాగుతోంది. లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అదే ఊపును కొనసాగిస్తూ శుక్రవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆసియాకప్‌లో భారత్ తర్వాత ఆశించదగ్గ ప్రదర్శన చేస్తున్న మరోజట్టు ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు. సంచలనాలకు మారుపేరైన ఆప్ఘన్ జట్టు లీగ్ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలవగా.. శుక్రవారం పాకిస్తాన్‌ను ముచ్చెమటలు పట్టించింది. 257 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించడానికి చివరి ఓవర్ వరకూ పోరాడాల్సి వచ్చింది. అంతేగాక ఏడు వికెట్లను కోల్పోయి ఓటమి కోరలనుండి బయట పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆదివారం పటిష్ట భారత్‌ను పాక్ ఓడించడం కష్టమేనని చెప్పవచ్చు. సూపర్-4లో ప్రతిమ్యాచ్ గెలుపు ముఖ్యం కావడం.. అదీగాక ఇరుజట్లు తొలిమ్యాచ్‌లో గెలిచిన నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేడు జరిగే మరో సమరానికి దుబారు వేదిక సిద్ధమైంది.
సత్తా చాటుతున్న బౌలర్లు...
టోర్నీలో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. హాంకాంగ్‌పై మినహా పాకిస్తాన్‌ను, బంగ్లాదేశ్ ఆటగాళ్ళందరినీ పెవిలియన్‌కు చేర్చిన ఘనత మన బౌలర్లదే. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్, జాదవ్ మూడేసి వికెట్లు తీసుకోగా... బుమ్రా రెండు వికెట్లు సాధించాడు. ఇక బంగ్లాదేశ్‌పై జడేజా ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, భువనేశ్వర్ మూడేసి వికెట్లు సాధించారు. పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన జడేజా బంగ్లాదేశ్ బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. హాంకాంగ్‌పై అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఖలీద్ అహ్మద్ రిజర్వ్ బెంచ్‌లో ఉండనే ఉన్నాడు.
ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్...
అలాగే టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా దుర్భేద్యంగానే ఉంది. హాంకాంగ్‌పై సెంచరీతో కదం తొక్కిన ధావన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపైనా రాణించాడు. తొలివికెట్‌కు రోహిత్‌తో కలిసి అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే రాయుడు హాంకాంగ్‌పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపై అర్ధసెంచరీలతో సత్తాచాటిన టీమిండియా సారథి రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో కేదర్ జాదవ్, దినేష్ కార్తీక్‌లు కూడా స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శిస్తున్నారు. లోయర్ ఆర్డర్లో ధోనీ, ఆల్‌రౌండర్ జడేజాలు జట్టుకు కొండంత అండగా ఉండనే ఉన్నారు.
కనీస పోటీ ఇచ్చేనా...
దాయాది పాకిస్తాన్‌తో పోటీ అంటేనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రీడాభి మానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఛాంపియన్ ట్రోఫీలో ఎదురైన పరాభవాన్ని బదులు తీర్చుకోవాలని కసితో ఏడాదితర్వాత బరిలోకి దిగిన భారత్‌కు పాక్ తొలి మ్యాచ్‌లో కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగి కేవలం 162 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఛాంపియన్స్ట్రోఫీ ఫైనల్లో 300కు పైగా పరుగులు సాధించిన జట్టు టీమిండియాతో మ్యాచ్ అనగానే ఒక్కసారిగా డీలాపడిపోయింది. లీగ్ దశలో హాంకాంగ్‌ను ఓడించి సూపర్-4లోకి ప్రవేశించినా... ఆఫ్ఘనిస్తాన్పై గెలవడానికి పాకిస్తాన్ చెమటోడ్చిన సంగతి తెలిసిందే.
భారతజట్టు (అంచనా) : రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్/రాహుల్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదర్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ(కీపర్), రవీంద్ర జడేజా, భువనేశ్వర్, బుమ్రా/ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, చాహల్.
పాకిస్తాన్ జట్టు (అంచనా) : ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, హరీష్ సొహైల్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్/షాదాబ్ ఖాన్, ఆసిఫ్ ఆలీ, మహ్మద్ నవాజ్, హసన్ ఆలీ, షాహిన్ అఫ్రిది, ఉస్మాన్‌ఖాన్/మహ్మద్ అమీర్.
మళ్లీ చిత్తుగా ఓడిస్తాం : రోహిత్
లీగ్ దశలో పాక్‌ను చిత్తుగా ఓడించినట్లే మళ్లీ అదే రీతిలో ఆదివారం మ్యాచ్‌లోనూ ఓడిస్తామని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నారు. అలాగే టోర్నీలో భాగంగా సూపర్-4లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ప్రదర్శనపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లాపై రోహిత్ 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రోహిత్‌శర్మ మాట్లాడుతూ.. 'ఆరంభం నుంచే భారత జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. మా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. బౌలర్లు సరైన బంతులు సంధిస్తే తప్పక వికెట్లు దక్కుతాయి. టోర్నీలో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని మెచ్చుకున్నాడు. పాక్‌తో మళ్ళీ పోరు విషయమై మాట్లాడుతూ.. 'ప్రణాళిక ప్రకారం వెళ్తే ఏదైనా సులభంగా గెలవవచ్చు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను సరికొత్తగా మొదలుపెడుతూ, పూర్వపు ప్రదర్శనను కొనసాగిస్తాం' అని పేర్కొన్నాడు.
టీమిండియా జోరుకు కళ్లెం వేస్తాం : సర్ఫరాజ్
హాంకాంగ్‌పై చెలరేగిన తమ బౌలర్లు... భారత్‌పై అంతగా ప్రభావం చూపలేకపోయారని వాపోయాడు. తొలిగా బ్యాటింగ్‌కు దిగి కేవలం కేవలం 162 పరుగులు మాత్రమే చేయడంతో బౌలర్లు రాణించే అవకాశం లేకుండా పోయిందన్నాడు. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్పై 257 పరుగుల లక్ష్యాన్ని చివరివరకూ పోరాడి గెల్చిన నేపథ్యంలో ఆదివారం భారత్‌పైనా తమ బ్యాట్స్మన్లు రాణించే అవకాశముంద న్నాడు. టాస్ గెలిస్తే తొలిగా బ్యాటింగ్ చేయడానికే ప్రాధాన్యతనిస్తానని... దుబారు పిచ్‌లపై 250కు పైగా పరుగులు చేస్తే గెలుపు తమదేనని అన్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి