హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డులో దారుణ హత్య.!

- September 26, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డులో దారుణ హత్య.!

హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే, పోలీసు గస్తీ వాహనానికి కొన్ని గజాల దూరంలోనే బుధవారంనాడు ఓ హత్య జరిగింది. అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్ 139 దగ్గర రమేష్ అనే వ్యక్తిని దుండగులు వేటాడి మరీ గొడ్డలితో నరికి చంపారు. దాడి జరిగిన వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ పక్క రమేష్‌ను గొడ్డలితో నరుకుతున్నప్పుడు, పక్క నుంచే పోలీసు వాహనం ఆగకుండా వెళ్లడం కనిపించింది. చనిపోయిన రమేష్ ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు.

'ఎనిమిది నెలల క్రితం మహేష్ గౌడ్ అనే వ్యక్తిని రమేష్ హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. మహేష్, రమేష్... ఇద్దరూ ఓ మహిళను ప్రేమించారు. దాంతో, పథకం ప్రకారం మహేష్‌ను రమేష్ హత్య చేశాడని ఆరోపణులు నమోదయ్యాయి. ఆ కేసులో రమేష్‌ను చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాం. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. మహేష్ చనిపోయిన నాటి నుంచి అతడి తండ్రి కిషన్ గౌడ్, బాబాయి లక్ష్మణ్ గౌడ్ అవకాశం కోసం ఎదురు చూడసాగారు.

ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో ఆ కేసు విచారణకు హాజరైన రమేష్ తిరిగి వెళ్తున్నప్పుడు కిషన్, లక్ష్మణ్‌లు అతడిని వెంటాడారు. చివరికి అత్తాపూర్ పిల్లర్ నంబర్ 139 దగ్గర రమేష్‌ను గొడ్డలితో నరికి చంపారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్‌ను కాపడటానికి ప్రయత్నించాడు. కానీ దుండగులు బైక్‌పై నుంచి రమేష్‌ను కిందకు లాగి గొడ్డలితో నరికేశారు. స్థానికులు కూడా వాళ్లను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అటుగా వెళ్తున్న లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆగి దాడి చేసినవారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపైన కేసు నమోదు చేశాం. గురువారంనాడు వారిని కోర్టులో హాజరుపరుస్తాం ' అని రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ జి.సురేష్ మీడియాతో చెప్పారు.

''నేను మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నప్పుడు, పిల్లర్ నంబర్ 140 దగ్గర ఓ వ్యక్తి ఆటోలో వస్తూ, 'నన్ను చంపుతారు, రక్షించండి' అని అరుస్తూ కనిపించాడు. ఆ వ్యక్తిని బైక్ ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్లా. కానీ, వెనుక నుంచి దుండగులు లాగడంతో మేం కిందపడిపోయాం. తరువాత అతడిని వెంటాడి చంపారు'' అని ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి చెప్పారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో బహిరంగంగా దాడులు జరగడం ఇది మూడోసారి. కరీంనగర్‌లోని మిర్యాలగూడలో ప్రణయ్ అనే కుర్రాడిని ఇటీవల బహిరంగంగానే హత్య చేశారు. గతవారంలో హైదరాబాద్‌లో ఎస్.ఆర్.నగర్‌లో ఓ కొత్తజంటపై నడిరోడ్డుమీదే కత్తితో దాడిచేశారు. తాజాగా నేడు అత్తాపూర్ కూడలిలో రమేష్‌ను అందరూ చూస్తుండగానే హత్య చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com