బందరు:రూ.100 కోట్లతో జరగనున్న అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
- September 29, 2018
మచిలీపట్నం: బందరు పోర్టు నిర్మాణం పూర్తి అయితే ఎనలేని అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, దేవాదాయశాఖ మంత్రికె.ఇ.కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి శుక్రవారం న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావు, పెడన ఎమ్మెల్యేకాగిత వెంకట్రావు, ముడ ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంతో కలసి బందరు పట్టణంలో రూ.100 కోట్లతో జరగనున్న అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చిలకలపూడి మూడుగుళ్ళ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. బందరు పోర్టు నిర్మించి బందరు వాసుల చిరకాల స్వప్నం తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం అనేక ఆర్ధిక ఒడుదుడుకులకు గురైనప్పటికి ముఖ్యమంత్రి చక్కటి ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చిన కేంద్రప్రభుత్వం రాష్ట్రం విషయంలో చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, బందరు తహసీల్దార్ కార్యాలయాలను నూతనంగా నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. ఆర్డీవో కార్యాలయం రూ.2.25 కోట్లతో, తహసీల్దార్ కార్యాలయం రూ.90లక్షలతో నిర్మించనున్నామని చెప్పారు. అదే విధంగా ఆక్వా కల్చర్‌కు కేంద్రం అయిన మచిలీపట్నంలోరూ.1.10కోట్లతో ఆక్వా లాబ్‌ను నిర్మిస్తున్నామన్నారు.
ఈ ల్యాబ్ వలన మచిలీపట్నం మండల పరిధిలోని ఆక్వా రైతుల అవసరాలు తీరుతాయన్నారు. రూ.68.52 కోట్లతో మచిలీపట్నం పురపాలక సంఘం ఫేజ్-1 క్రింద మిగిలి ఉన్న వరదనీరు పారుదల డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టి మార్చి 2019 నాటికి పూర్తి చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నామన్నారు. విజయవాడ కొండలపైన నివాసం ఉంటున్న40వేల మందిని గుర్తించి మహిళల పేరున ఇంటి పట్టాలు త్వరలో జారీ చేయనున్నామన్నారు. విశాఖపట్నంలో ఇప్పటికే పట్టాలు లేని నిరుపేదలకు వారి పేరునే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. బందరు పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు నిర్మించి ఇస్తామని, అవసరమైతే భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడతామన్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.
రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో రూ.1600 కోట్లతో మచిలీపట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు జరగని అభివృద్ధి ఎన్నో రెట్లు సాధించుకున్నామన్నారు. గతంలో మచిలీపట్నం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా గత నాలుగు సంవత్సరాలలో 90 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. అమృత్ పథకంలో భాగంగా పట్టణంలోని అన్ని మంచినీటి పైపులైన్లు మార్చడం జరుగుతుందన్నారు. ఎంత పెద్ద వర్షం వచ్చినా డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచి పంపింగ్ కేంద్రాల ద్వారా వర్షపునీటిని బయటకు పంపే విధంగా పంపింగ్ కేంద్రాలు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. సాగరమాలను అభివృద్ధి పరచడంలో పోర్టు నిర్మాణం ఒక్కటే మార్గం అన్నారు.
వీటి పనులను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. డిసెంబర్‌నాటికి జి ప్లస్-3 విధానంలో గృహ లబ్ధిదారులకు గృహాలు అందించడం జరుగుతుందన్నారు. వివిధ వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ భవనాలు, బ్యాంకు రుణాలు అందించడం ద్వారా పేద ప్రజలకు ఆర్ధిక స్వావలంభన చేకూర్చే విధంగా పని చేస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. బందరు ఎంపి కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ బందరు డ్రైనేజి వ్యవస్థను తిరిగి చేపట్టడం ద్వారా బందరు ప్రజలకు మురుగునీటి కష్టాలు తీరతాయన్నారు. బందరు పోర్టు నిర్మాణం కోసం రూ.1400 కోట్లు బ్యాంకు గ్యారంటీగా రూ.200 కోట్లతో రైతుల నుండి భూములు కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి సహకారం అందించారన్నారు. ఎమ్మెల్సీ బచ్చులఅర్జునుడు మాట్లాడుతూ విజయవాడ నుండి బందరుకు నాలుగు లైన్ల రోడ్డు, గుడివాడకు డబుల్‌లైన్ రోడ్డు, మచిలీపట్నం-విజయవాడ రైల్వే ఎలక్ట్రికల్ డబుల్ లైన్ పనులు రాబట్టడంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావులకృషి ఉందన్నారు.
పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బందరు పట్టణం అభివృద్ధి చెందిన పట్టణంగా మారుతుందన్నారు. ముడ ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా చివరి ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వడంలో ముఖ్యమంత్రి దూరదృష్టిని కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌ఛైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాధం, బందరు ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాద్, హౌసింగ్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, నారగాని ఆంజనేయప్రసాద్, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి