గుండెను పిండేస్తోంది : ప్రధాని మోదీ ట్వీట్

గుండెను పిండేస్తోంది : ప్రధాని మోదీ ట్వీట్

పంజాబ్‌లో ఘోరం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లో నిర్వహించిన రావణ దహన వేడుకలు పెను విషాదం మిగిల్చాయి. చౌరా బజార్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ సమీపంలో రావణ దహనం నిర్వహించారు. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకు రావడంతో పెను ప్రమాదానికి దారితీసింది.

అమృత్‌సర్‌ ప్రమాదంలో 61 మంది మృతి చెందగా మరో 72 మందికి పైగా గాయపడ్డారు. చౌరా బజార్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ సమీపంలో రావణ దహనం నిర్వహించారు. చాలామంది పట్టాలపై నిలబడి ఆ ఘట్టాన్ని తిలకిస్తూ ఉన్నారు. రావణ ప్రతిమ తగలబడుతున్నప్పుడు.. బాణసంచా పేలుడు శబ్దానికి రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా వేగంగా దూసుకెళ్లింది. దీంతో.. ట్రాక్‌పై నిలబడి రావణ దహనాన్ని వీక్షిస్తున్నవారు ప్రాణాలు కోల్పోయారు.

అప్పటివరకు కోలాహలంగా ఉన్న చౌరా బజార్‌ ప్రాంతం .. రైలు ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది.61మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినప్పుడు రైల్వే ట్రాక్‌పై 500 మందికి పైగా ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. పటాన్‌కోట్‌ నుంచి అమృత్‌సర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకురావడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

రైలు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంజాబ్‌లో రైలు పట్టాలపై చోటుచేసుకున్న విషాదం షాక్‌కు గురి చేసిందని కోవింద్‌ పేర్కొన్నారు. 60 మందినిపైగా బలిగొన్న ఈ ప్రమాదం గుండెను పిండేస్తోందని మోదీ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ సారథి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ తమ పార్టీల కార్యకర్తలను కోరారు. దసరా వేడుకల్లో మాటలకందని విషాదం చోటుచేసుకుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

జోడాఫటాక్‌ వద్ద ప్రతి సంవత్సరం దసరా వేడుకలు జరుగుతాయని.. ఆ సమయంలో రైళ్లను నెమ్మదిగా నడపాలని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నా రైల్వే శాఖ పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పంజాబ్‌ సర్కారు ఇవాళ సంతాపదినంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

దక్షిణాదిలో దసరాను దసరా రోజు గురువారం జరుపుకోగా.. ఉత్తరాదిన శుక్రవారం చేసుకున్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా సహా పలు చారిత్రక ప్రదేశాల్లో రావణ దహనాన్ని ఘనంగా నిర్వహించారు. అదే క్రమంలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని చౌరా బజార్‌లోను రాహవణ దహన ఘట్టం చేపట్టారు. అయితే.. రైలు పట్టాలు సమీపంలో ఉండడం… జనం వేలాదిగా రావడం.. ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది. ట్రెయిన్ వస్తోందన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఇది నిర్వాహకుల వైఫల్యమనే వాదనా వినిపిస్తోంది. రైలు వస్తున్నప్పుడు అప్రమత్తం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. రావణ దహనం జరుగుతున్నప్పుడు పెద్దస్థాయిలో బాణసంచా పేలుళ్లు జరిగాయి. ఆ శబ్దానికి రైలు వస్తున్న విషయం తెలీలేదు. నిర్వాహకులు అప్రమత్తం చేసి ఉంటే.. ప్రమాదాన్ని నివారించి ఉండేవారు. కనీసం.. లోకో పైలట్‌ అయినా జాగ్రత్త తీసుకుని ఉంటే.. మృతుల సంఖ్య తగ్గి ఉండేది. ఏ ఒక్కటీ జరగలేదు.

Back to Top