వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి

- October 25, 2018 , by Maagulf

విశాఖపట్నం: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. వీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనపై వెయిటర్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జగన్‌ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. విమానాశ్రయ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
 
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌.. అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో జగన్‌ వద్దకు వచ్చిన వెయిటర్‌ ఆయనతో మాట్లాడుతూనే చిన్న కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో జగన్‌ ఎడమ భుజానికి గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌ పయనమయ్యారు.
 
ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్‌పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్దయెత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన జరిపెల్లి శ్రీనివాస్‌గా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com