ఆదివాసీ తెగవారికి మత బోధచేయాలని వెళ్లి అసువులు బాసిన క్రైస్తవ మతబోధకుడు

- November 22, 2018 , by Maagulf
ఆదివాసీ తెగవారికి మత బోధచేయాలని వెళ్లి అసువులు బాసిన క్రైస్తవ మతబోధకుడు

అండమాన్‌లో రక్షిత ఆదిమ తెగ వారిని కలుసుకోవడానికి వెళ్లిన అమెరికన్ ఒకరు వారి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అండమాన్ దీవుల సమూహంలోని ఉత్తర సెంటినెల్‌ దీవిలో ఈ విషాదం చోటుచేసుకుంది. బయటివారిని బద్ధ శత్రువులుగా పరిగణించే ‘సెంటినెలీస్‌’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికన్‌ అయిన జాన్‌ అలెన్‌ ఇంతకుముందు ఐదుసార్లు అండమాన్‌, నికోబార్‌ దీవులను సందర్శించారు. తాజా పర్యటనలో ఆయన సెంటినెలీస్‌ తెగ వారిని కలుసుకోవాలని అనుకున్నాడు. జాన్‌ క్రైస్తవ మతబోధకుడని, ఆ ఆదివాసీ తెగవారికి కూడా మత బోధన చేయాలన్నది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది. అయితే సెంటినెలీస్‌ తెగవారు బయటివారితో సంబంధాలను ఏ మాత్రం సహించరు.

ఈ తెగవారిని కలిసేందుకు జాన్‌ ఈ నెల 14న ఒకసారి విఫలయత్నం చేశారు. 16న మరోసారి ప్రయత్నించారు. ఆ రోజున మత్స్యకారులకు రూ.25వేలు చెల్లించి, చిదియాతాపు ప్రాంతం నుంచి వారి పడవలో సెంటినెల్‌ దీవి సమీపం వరకూ వెళ్లారు. ప్రత్యక్ష సాక్షులైన మత్స్యకారుల కథనం ప్రకారం.. దీవిలో కాలు మోపగానే జాన్‌పై బాణాల వర్షం కురిసింది. అయినా జాన్ ముందుకు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలి పోయాడు. ఆదిమ తెగ వారు ఆయన మెడకు తాడు కట్టి తీరం వద్దకు ఈడ్చుకెళ్లారు. ఆయన మృతదేహాన్ని సగం మేర ఇసుకలో పూడ్చిపెట్టారు.

మత్స్యకారులు పోర్ట్‌బ్లెయిర్‌కు తిరిగొచ్చాక ఈ ఘటనను జాన్‌ మిత్రుడైన స్థానిక మతబోధకుడు అలెక్స్‌కు తెలిపారు. దీంతో ఆయన అమెరికాలోని జాన్‌ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశారు. వారు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీరరక్షక దళం, గిరిజన సంక్షేమ, అటవీ శాఖల సిబ్బందితో కూడిన బృందం ప్రయత్నాలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com