2022లో జి20కి భారత్‌ ఆతిథ్యం

- December 03, 2018 , by Maagulf
2022లో జి20కి భారత్‌ ఆతిథ్యం

బ్యూనస్‌ ఎయిర్స్‌ : జి20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు 2022లో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన జి20 దేశాల సదస్సు ముగింపు రోజైన ఆదివారం ప్రధాని ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి 2022లో ఈ సదస్సును ఇటలీ నిర్వహించాల్సి వున్నప్పటికీ ప్రధాని కోరిక మేరకు భారత్‌కు ఈ అవకాశం కల్పిస్తూ సదస్సు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 2022 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కల్పించిన ఇటలీకి కృతజ్ఞతలు తెలిపారు. 2022లో జరిగే జి20 దేశాల సదస్సుతో పాటు ఆ ఏడాది జరిగే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలలో కూడా పాలు పంచుకోవాలని ఆయన జి20 దేశాధినేతలను ఆహ్వానించారు. '2022 నాటికి స్వతంత్య్ర భారతానికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ ప్రత్యేక సందర్భంలో నిర్వహించే జి20 సదస్సుకు ప్రపంచ దేశాలను ఆహ్వానించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ప్రపంచంలో అత్యవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌కు రండి.. ఘనమైన భారత చరిత్రను, వైవిధ్యాన్ని తెలుసుకోండి.

భారత్‌ సాదర ఆతిథ్యాన్ని ఆస్వాదించండి' అంటూ ప్రధాని తన ప్రకటన అనంతరం ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. భారత్‌తో పాటు అర్జెంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఐరోపా దేశాల కూటమి, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ద.కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా దేశాలు సభ్యులుగా వున్న జి20 కూటమికి స్పెయిన్‌ శాశ్వత ప్రత్యేక అతిధి కావటం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com