రష్యా పర్యటన ఎంతో ముఖ్యమైంది-- ప్రధాని నరేంద్రమోడీ

- December 23, 2015 , by Maagulf
రష్యా పర్యటన ఎంతో ముఖ్యమైంది-- ప్రధాని నరేంద్రమోడీ

రష్యా పర్యటన ఎంతో ముఖ్యమైందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోడీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో భేటీ కానున్నారు. రష్యా పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో 'నేను ఈ రోజు రష్యా పర్యటనకు వెళ్తున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చ నిమిత్తం నేను చేస్తున్న తొలి రష్యా పర్యటన ఇది. ఈ పర్యటన పట్ల నేనేంతో ఆశావాహంతో ఉన్నాను. భారత్-రష్యా మధ్య సంబంధాలు గొప్పవని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే రష్యా భారత్కు కీలక మిత్రదేశం. ఈ సందర్భంగా నా ఆలోచన ఓసారి 2001లోకి వెళ్లింది. నాడు నేను గుజరాత్ సీఎంగా బాధ్యతలు తీసుకోగానే నాడు అటల్ బిహారీ వాజపేయితోపాటు రష్యాకు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు. నా పర్యటనతో భారత్-రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలు ప్రధానంగా ఒప్పందాలు చేసుకోవడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్ ఇతర రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటాం. వీటి ద్వారా మాకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. రష్యా వ్యాపార వేత్తలతో కూడా సమావేశం ఉంటుంది. వారిని భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తాం' అని మోడీ తన ప్రకటనలో తెలిపారు. మోడీ-పుతిన్ భేటీలో రష్యాతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా ప్రత్యేకించి అణు విద్యుత్, హైడ్రోకార్బన్లు, రక్షణ, వాణిజ్య రంగాలు లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. గురువారం ఇరువురు నేతల మధ్య చర్చల తర్వాత ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకుని కాలపరీక్షకు నిలిచిన ఈ రెండు మిత్ర దేశాలు అణు విద్యుత్, రక్షణ రంగాలతో పాటుగా పలు రంగాలకు చెందిన అనేక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి. 2000 సంవత్సరంనుంచి ఈ రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో ప్రతి ఏటా న్యూఢిల్లీ, మాస్కోలు ఏడాది విడిచి ఏడాది జరుగుతున్న విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన పలు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని తాము భావిస్తున్నాయని, వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దుతున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ మంగళవారం విలేఖరులకు చెప్పారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న 10 బిలియన్ డాలర్ల స్ధాయినుంచి రాబోయే పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నందున వాణిజ్య సంబంధాల విస్తరణ ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు మోదీ, పుతిన్లు సిరియాలో పరిస్థితితో పాటుగా పలు ప్రపంచ సమస్యలు, ఉగ్రవాదం లాంటి అనేక అంశాలపై కూడా చర్చించనున్నారు. మనకు సంబంధించినంతవరకు ఈ చర్చలు అత్యంత ప్రధానమైనవని జైశంకర్ చెప్పారు. రష్యాకు చెందిన చమురు, బొగ్గు రంగాల్లో మరింతగా పాలు పంచుకోవడంతో పాటుగా రత్నాల వ్యాపారం, వ్యవసాయాధారిత వ్యాపారాలులాంటి వాటిలో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని మన దేశం భావిస్తోందని జైశంకర్ తెలిపారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశం రష్యాలో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రాజెక్టులో మరింతగా పాలు పంచుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. రక్షణ, అణుఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై రెండు దేశాలు చర్చలు జరుపుతాయని జైశంకర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. చాలా కాలంగా రష్యా మనకు ప్రధానమైన రక్షణ, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటోందని, అందువల్ల ఈ విషయంపై బోలెడంత చర్చ జరగవచ్చని జైశంకర్ తెలిపారు. గత వారం రక్షణ రంగానికి చెందిన అత్యున్నత స్థాయి రక్షణ పరికరాల కొనుగోలు మండలి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన రష్యాకు చెందిన ఎస్-400 ట్రంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి అంగీకారం తెలియజేసిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com