విద్యార్థులను తిప్పి పంపేస్తున్నారన్నకథనాలను ఖండించిన యూనివర్సిటీలు

- December 23, 2015 , by Maagulf
విద్యార్థులను తిప్పి పంపేస్తున్నారన్నకథనాలను ఖండించిన యూనివర్సిటీలు

భారతదేశం నుంచి సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ (ఎస్‌వీయూ), నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ (ఎన్‌పీయూ)లలో ఉన్నత విద్య చదువుకోడానికి వెళ్తున్న విద్యార్థులను తిప్పి పంపేస్తున్నారన్న కథనాలను ఆయా యూనివర్సిటీలు ఖండిస్తున్నాయి. ఇప్పటికీ తమ యూనివర్సిటీకి వివిధ దేశాల నుంచి చాలామంది విద్యార్థులు వస్తూనే ఉన్నారని, వాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నామని ఎన్‌పీయూ ప్రెసిడెంట్ పీటర్ సీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై భారతీయ మీడియాలో కొన్ని అసత్య కథనాలు ప్రసారం అవుతున్నాయని, దయచేసి వాటిని విద్యార్థులు విశ్వాసంలోకి తీసుకోవద్దని తెలిపారు. కొంతమంది విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి తిప్పి పంపేసిన మాట వాస్తవమేనని, అయితే ఇక్కడకు వస్తున్న మొత్తం విద్యార్థులలో వాళ్ల సంఖ్య నామమాత్రమేనని అన్నారు. దానికి కారణం ఏంటో కూడా ఆయన వివరించారు. ఇమ్మిగ్రేషన్ ఇంటర్వ్యూలలో వాళ్లు ఫెయిలయ్యారని తెలిపారు. అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తారా అని అడిగితే చేస్తామని చెప్పడం, ఆర్థిక స్థోమతకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో పాటు ఎంతమంది కలిసి వచ్చారని అడిగినప్పుడు తనతోపాటు విమానంలో కలిసిప్రయాణించిన అందరినీ కలిపి చెప్పడంతో ఆ బ్యాచ్‌లో ఉన్న 15 మందిని వెనక్కి తిప్పి పంపేసినట్లు వివరించారు. ఇందులో ఎక్కడా ఎన్‌పీయూను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు చెప్పలేదని ఆయన అన్నారు. అమెరికా చట్టాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలని, ఏ దేశం నుంచి వచ్చిన వాళ్లయినా వాళ్లు ఏ యూనివర్సిటీలో చదవాలన్నా కూడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఫీజులు చెల్లించడానికి, అక్కడ ఉండటానికి తగిన ఆర్థిక స్థోమత ఉందా అనేది అందులో ముఖ్యమైనది. సాధారణంగా చదువుకునే సమయంలో ఉద్యోగాలకు అనుమతించరు కాబట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేస్తామని చెబితే తిప్పి పంపేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కాబట్టి, ఇమ్మిగ్రేషన్ ఇంటర్వ్యూ విషయంలో విద్యార్థులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com