అక్కడ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం

- December 12, 2018 , by Maagulf
అక్కడ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం

ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం దక్కింది. ఊహించని స్థాయిలో 67 సీట్లు గెలవడంతో హస్తం నేతలు కూడా ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇవాళ జరిగే సీఎల్బీ భేటీలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం రేసులో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో విపక్ష నేత TN సింగ్ దేవ్‌ తోపాటు PCC చీఫ్ భూపేష్ భాగెల్‌ ఇద్దరూ బలమైన నేతలుగా కనిపిస్తున్నారు. వీరితోపాటు OBC నేత తామ్రజ్‌వాజ్ సాహు కూడా బలంగానే కనిపిస్తున్నారు. రవీంద్రచౌబే, చరణ్‌దాస్ మహంత్ పేర్లు కూడా వినిపించినా ఆ ప్రతిపాదనలు మొదట్లోనే ఆగిపోయాయి. సింగ్‌ దేవ్‌, భూపేష్ భాగెల్ ఇద్దరి మధ్యే పోటీ ఉన్నా.. హైకమాండ్ ఎవరివైపు మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య సెక్స్ సీడీల కేసులో జైలుకు వెళ్లి రావడం భూపేష్‌కి మైనస్‌గా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి AICC పరిశీలకులు రాయ్‌పూర్ చేరుకోనున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఇవాళ తేలిపోనుంది.

ఇప్పుడు పటన్‌ నుంచి MLAగా గెలిచిన ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్‌ భాగెల్‌కి‌.. ఉమ్మడి మధ్యప్రదేశ్‌లో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. తర్వాత ఛత్తీస్‌గఢ్ ఏర్పడ్డాక అజిత్‌ జోగీ కేబినెట్‌లోనూ మంత్రిగా ఉన్నారు. 2004లో దుర్గ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌పూర్‌ నుంచి విజయం సాధించారు. 2013లో పటాన్ నుంచి గెలిచారు దీంతోపాటు.. ఈసారి పార్టీని అధికారంలోకి తేవడంతో కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారే అవకాశం ఉంది. ఇక అంబికాపూర్ నుంచి గెలిచిన TN దేవ్.. సీఎల్పీ మీటింగ్‌లో మెజార్టీ ఎమ్మెల్యేలు తననే సపోర్ట్ చేస్తారని ధీమాగా ఉన్నారు. ఒకవేళ కుల సమీకరణాలనే లెక్కలోకి తీసుకుంటే తామ్రజ్‌వాజ్ సాహు అనూహ్యంగా సీఎం అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్.. మొదట్నుంచి గట్టిపోటీనే ఎదుర్కొంది. అజిత్ జోగీ లాంటి నేత కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టడం పెద్ద మైనస్‌గా కనిపించింది. పైగా సీఎం రమణ్‌సింగ్ పక్కా వ్యూహంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదిపారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కతాటిపైకి వచ్చాయి. అధికారాన్ని సొంతం చేసుకున్నారు. 90 సీట్లున్న అసెంబ్లీలో కేవలం 15 సీట్లకే పరిమితమై బీజేపీ ఘోర పరాభవం చెందడంతో సీఎంగా రాజీనామా చేసిన రమణ్‌సింగ్.. ఓటమికి నైతిక బాధ్యత వహించారు. ఇక ఇప్పుడు గద్దెనెక్కబోతున్న కాంగ్రెస్.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పక్కా లెక్కలు వేసుకుంటోంది. ఎక్కడా అసంతృప్తికి తావు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com