విశాఖలో కీలక ఘట్టం ఆవిష్కృతం:చంద్ర బాబు

- December 14, 2018 , by Maagulf
విశాఖలో కీలక ఘట్టం ఆవిష్కృతం:చంద్ర బాబు

విశాఖను మెడికల్ హబ్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వైద్య పరికరాల తయారీ కోసం నిర్దేశించిన మెడ్ టెక్ జోన్ ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మెడ్ టెక్ విశేషాలతో కూడిన బుక్ ను ఆవిష్కరించిన చంద్రబాబు.. అంతర్జాతీ స్థాయి ప్రామాణాలతో రూపుదిద్దుకున్న మెడ్ టెక్ జోన్ తో దేశంలో వైద్య పరికరాల ధరలు భారీగా తగ్గే అవకాశముందన్నారు.

మొత్తం 70ఎకరాల విస్తీర్ణంలోని 80 తయారీ‌ యూనిట్లను మెడ్ టెక్ జోన్ లో తొలిదశలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో వైద్యపరికరాల తయారీ యూనిట్లు వివిధ రాష్ట్రాల్లో 800పైగా ఉన్నాయి. ఐతే, మెడికల్ ఇన్ స్ట్రూమెంట్ల తయారీకి ప్రత్యేకంగా మెడ్ టెక్ జోన్ లాంటి పార్క్ ను ఏర్పాటు చేయటం మాత్రం దేశంలో ఇదే మొదటిది. ఆసియాలోనే జపాన్‌, చైనా, సౌత్ కొరియాల తర్వాత వైద్య పరికరాలు తయారయ్యే అతి పెద్ద పార్క్‌ కావటం విశేషం. మెడ్ టెక్ జోన్ ప్రారంభం తర్వాత..ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ ఫోరం సదస్సులో పాల్గొన్న చంద్రబాబు..జోన్ లోని మరో 50 ఎకరాల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.

విశాఖలోని తగరపు వలసలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొన్న చంద్రబాబు.. కుమ్మక్కు రాజకీయాలతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని విపక్షాలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కు అడ్డుపడుతున్న కేసీఆర్ కు జగన్, పవన్ మద్దతుగా నిలబడుతున్నారని ఆరోపించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రయోజనాల కోసం తాను ఎవర్నైనా ఎదుర్కునేందుకు సిద్ధమన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని మోసం చేయాలని చూసినందుకే కేంద్రంలో బీజేపీ కి దూరమయ్యామని చెప్పారు. బీజేపీకి బుద్ధి చెప్పేలా మిగిలిన పార్టీలను ఒకే తాటిపైకి తీసుకున్నామని వివరించారు. మరోవైపు.. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు… 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఐ-హబ్ కు శంకుస్థాపన చేశారు. మేఘాద్రిగడ్డపై సోలార్ పవర్ ప్లాంట్, జీవీఎంసీ పరిధిలో 35 వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com