ఏపీకి తప్పిన పెను తుఫాను గండం...
- December 17, 2018
అమరావతి:హమ్మయ్య.. పెను గండం తప్పింది. ఊహించినట్టే పెథాయ్ తుఫాను క్రమంగా బలహీన పడుతోంది. కాకినాడ-యానాం మద్య తీరం దాటింది. ఒడిషావైపు కదులుతోంది. అయితే ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కానీ ఉదయం నుంచి కురిసిన వర్షాలు చాల చోట్ల తెరిపిచ్చాయి. ప్రస్తుతం తుఫాను తీరం దాటినా.. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.
పెథాయ్ తుఫాను తీరం దాటినా.. ఏపీలో ఏడు జిల్లాలపై పెను ప్రభావం చూపించింది. మొదట తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని తాకిన తరువాత.. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. తుఫాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచే ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. తుఫాను ప్రభావంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని చోట్ల బస్సులు, రైళ్లు, విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తాకిడికి పలుచోట్ల సెల్‌టవర్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పెథాయ్ ప్రభావంతో ఉత్తరాంధ్రాతోపాటు విజయవాడ, ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. చాలాచోట్ల గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, సెల్‌టవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. తుఫాను తీరం దాటిన తరువాత.. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమపై అధిక ప్రభావం కనిపించింది. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంట పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు సహా 47 ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. తుపాను కారణంగా విశాఖలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖకు రావాల్సిన మొత్తం 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 750 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరికి ఆయా విమానయాన సంస్థలు మంచినీరు, ఆహార ఏర్పాట్లు చేశాయి.
మరోవైపు పెథాయ్ తుఫాను దాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో రోడ్లపై చెట్లు కూలిపోయాయి. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో రోడ్లపై కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఐదురోడ్ల జంక్షన్ దగ్గర చెట్లు కూలడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రజాజీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.
భీమిలి నియోజకవర్గంలో పలు మత్స్యకార గ్రామాలను మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో గాలులతో కూడిన వర్షాల కురుస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, అనంతగిరి మండలాల్లో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







