హీరో విశాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

- December 20, 2018 , by Maagulf
హీరో విశాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తమిళ నిర్మాతల మండలిలో విభేదాలు మరింత ముదిరాయి. కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్‌కి వ్యతిరేకంగా చిన్న నిర్మాతల ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చెన్నైలోని టీనగర్‌లో ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్‌కు తాళం వేసిన కొందరు చిన్న నిర్మాతలు ఆందోళనకు దిగారు. ఈ పరిణామాలతో ఆగ్రహంగా ఉన్న విశాల్‌.. ఇవాళ ఆఫీస్‌కు వచ్చి తాళం పగలగొట్టి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. విశాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, విశాల్‌కు మధ్య గంటపాటు వాగ్వాదం జరిగింది.

TFPC అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా కొందరు ఆఫీస్‌కు తాళం వేశారని, అలాంటి వ్యక్తుల్ని పోలీసులు సపోర్ట్ చేస్తుండడం దారుణమని విశాల్ మండిపడ్డారు. తన రాజీనామాకు డిమాండ్ చేయడం అర్థరహితమన్నారు. జనరల్‌బాడీ మీటింగ్‌లో అన్నింటికీ సమాధానం చెప్తానని, లెక్కలన్నీ చూపిస్తానని అంటున్నారు.

2015లో అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విశాల్ నిలబెట్టుకోలేకపోయారన్నది కొందరి ఆరోపణ. చిన్న సినిమాల రిలీజ్‌లు, ధియేటర్ల విషయంలో విశాల్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వారంటున్నారు. నటుడు, నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్‌కి వ్యతిరేకంగా దాదాపు 50 మంది ఆందోళనకు దిగడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. నడిగర్ సంఘం, నిర్మాతల మండలిలోలో విశాల్ పెత్తనం ఎక్కువైందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలు ఖండించిన విశాల్.. తనను వ్యతిరేకిస్తున్న వారికి సరైన సమాధానం చెప్తానంటున్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఖాతాల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు నిర్మాతలు కేసు పెట్టారు. ఐతే.. దీనిపై పూర్తి వివరాలు తీసుకునే వరకూ FIR నమోదు చేయలేమని పోలీసులు చెప్తున్నారు. అటు, కౌన్సిల్ ఆఫీస్‌కు తాళం వేసిన వారిపై విశాల్ కూడా ఎదురు కేసు పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com