తెలంగాణ:మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం!

- December 21, 2018 , by Maagulf
తెలంగాణ:మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం!

తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వీటిని మనుగడలోకి తెచ్చేందుకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రజల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా కొత్తగా 2 జిల్లాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 7 మండలాల ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళిక రెవెన్యూశాఖ సిద్ధం చేస్తోంది. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అలాగే కోరుట్ల, కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గట్టుప్పల్, మల్లంపల్లి, చుండూరు, మోస్రా, ఇనుగుర్తి, నారాయణరావుపేట మండల కేంద్రాలు కానున్నాయి.

ముఖ్యమంత్రి KCR ఇప్పటికే కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు పాలనాపరంగా చేపట్టాల్సిన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐతే.. ఇప్పుడు మరికొన్ని డిమాండ్లు కూడా కొత్తగా తెరపైకి రావడంతో వాటిపై ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని కొత్త డిమాండ్ వినిపిస్తోంది.14 మండలాలతో దీన్ని జిల్లా చేయాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. మిర్యాలగూడ, సత్తుపల్లి కూడా జిల్లాలు చేయాలన్న వాదన బలంగా తెరపైకి వచ్చింది. ఏటూరునాగారాన్ని ఆదివాసీ జిల్లాగా చేయాలని కూడా కోరుతున్నారు. ఇవి కాకుండా మండలాల డిమాండ్లయితే కోకొల్లలుగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com