పడి పడి లేచె మనసు:రివ్యూ

- December 21, 2018 , by Maagulf
పడి పడి లేచె మనసు:రివ్యూ

నటీనటులు: శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సుహాసిని, సునీల్, ప్రియదర్శి, 'వెన్నెల' కిశోర్, సంపత్ రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
కెమెరా: జయకృష్ణ గుమ్మడి (జె.కె.)
కూర్పు: శ్రీకర్ ప్రసాద్ 
సాహిత్యం: కృష్ణకాంత్ (కేకే), సిరివెన్నెల (ఓ పాట మాత్రమే)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
విడుదల తేదీ: డిసెంబర్ 21, 2018

శర్వానంద్, సాయి పల్లవి జంట చూడముచ్చటగా ఉంది. విడుదలకు ముందు పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మొత్తంగా శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో 'పడి పడి లేచె మనసు'ను తప్పక చూడాలని ప్రేక్షకులు అనుకునేలా చేశాయి. దర్శకుడు హను రాఘవపూడి 'లై' ప్లాప్ ఎవరికీ గుర్తు రానంతగా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? లేదా? రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ: 
సూర్య (శర్వానంద్) తొలిచూపులో వైశాలి (సాయి పల్లవి)ని ప్రేమిస్తాడు. ఆమె వెంట పడి పడి మరీ ప్రేమలో పడేస్తాడు. ఓ రోజు వైశాలి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా... తాను పెళ్ళికి వ్యతిరేకమనీ, ఇప్పుడు ఉన్నట్టు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉందామని సూర్య చెబుతాడు. అతడి మాటలతో వైశాలి ఏకీభవించడు. ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి బ్రేకప్ అవుతారు. విడిపోయే ముందు ఏడాది తరవాత మళ్ళీ ఇదే చోటు కలుసుకోవాలని ఇద్దరూ అనుకుంటారు. అప్పుడు విడివిడిగా బతకలేమని భావిస్తే పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. ఏడాది తరవాత వైశాలికి రెట్రోగ్రేడ్ అమీషియా (ఓ గాయం వల్ల గత జ్ఞాపకాలు మర్చిపోయే వ్యాధి) ఉందని సూర్యకు తెలుస్తుంది. అతణ్ణి వైశాలి గుర్తు పట్టదు. దాంతో తనను కార్తీక్‌గా వైశాలికి పరిచయం చేసుకున్న సూర్య.. మళ్ళీ ప్రేమలోకి పడేయాలని ప్రయత్నిస్తాడు. మరోసారి వైశాలి ప్రేమలో పడిందా? నిజంగా ఆమెకు రెట్రోగ్రేడ్ అమీషియా ఉందా? లేదా? చివరికి, ఈ జంట ప్రేమకథ ఏ కంచికి చేరింది? అనేది సినిమా.

విశ్లేషణ: 
పేరుకు తగ్గట్టు సినిమా పడి పడి లేచిందని అనుకునేలోపు మళ్లీ కిందకు పడింది. ప్రేమ సన్నివేశాలను అందంగా, ఆహ్లాదకరంగా, కొత్తగా తీయగల నేర్పు దర్శకుడు హను రాఘవపూడి సొంతం! అదే అయన బలం. ఈ సినిమాలోనూ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్ అంతా బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్‌తో నింపేశాడు. ఎంతసేపటికీ కథ ముందుకు కదలడం లేదని చిన్న కంప్లయింట్ ఉన్నా.... ఆ మూమెంట్స్ అంత అందంగా ఉన్నాయంటే కారణం విశాల్ చంద్రశేఖర్ స్వరాలు, నేపథ్య సంగీతమే. ఫస్టాఫ్‌లో వచ్చిన ప్రతి పాట సూపర్బ్‌. సినిమాటోగ్రఫీ కూడా! పాటల్లో, సన్నివేశాల్లో ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంది. హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ 'ఇడియట్'లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను గుర్తుకు తెస్తుంది. దీనికి తోడు హీరో హీరోయిన్ బ్రేకప్‌కి చూపించిన కారణం, ఆ సన్నివేశంలో హీరో ప్రవర్తించే విధానం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదు. సెకండాఫ్‌లో పలు సన్నివేశాలు రిపీట్ చేసినట్టు అనిపిస్తాయి. అలాగే, కథలో వేగం తగ్గి నెమ్మదిగా ముందుకు సాగడం వల్ల ప్రేక్షకులకు కాస్త విసుగు వచ్చే అవకాశం ఉంది. నిజంగా హీరోయిన్‌కి రెట్రోగ్రేడ్ అమీషియా ఉందో? లేదో? అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతున్న సమయంలో సినిమాను ముగించాడు. ముందు చెప్పినట్టు సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం మెయిన్ అసెట్. సినిమాటోగ్రఫీ కూడా. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఒక్క భూకంపం సన్నివేశంలో తప్ప. అక్కడ గ్రాఫిక్స్ బాలేదు. కోల్‌కత్తా నేపథ్యం తీసుకోవడం వల్ల కొన్ని సన్నివేశాల రూపమే మారింది. కథకు కొత్త ఫీల్ వచ్చింది. అయితే.. .కథలో ఏముంది? అని ప్రశ్నించుకుంటే కొత్తగా ఏమీ ఉండదు. కొత్తగా చెప్పాలని చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: 
శర్వానంద్, సాయి పల్లవి కెమిస్ట్రీ
వినోదాత్మక సన్నివేశాలు
విశాల్ చంద్రశేఖర్ స్వరాలు, నేపథ్య సంగీతం
జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ, లొకేషన్స్

మైనస్ పాయింట్స్: 
బలహీనమైన కథ
సన్నివేశాల్లో సాగదీత

నటీనటుల పనితీరు:

సూర్య పాత్రకు శర్వానంద్, వైశాలి పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేశారు. ఇద్దరి కెమిస్ట్రీ సూపర్. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి, దొంగ పాత్రలో 'వెన్నెల' కిషోర్ నవ్వించారు. వాళ్లిద్దరూ ఉన్న సన్నివేశాల్లో హను రాఘవపూడి రాసిన పంచ్ డైలాగ్స్ బావున్నాయి. సునీల్ పాత్ర పర్వాలేదు. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తల్లిగా ప్రియా రామన్ హుందాగా కనిపించారు.

చివరగా: 
హను రాఘవపూడి రాసుకున్న కథలో బ్యూటిఫుల్ రొమాంటిక్ మూమెంట్స్ ఉన్నాయి. అలాగే, కథ నుంచి బయటకు వెళ్లకుండా కామెడీని రాశాడు. కానీ, చాలా సన్నివేశాలను సాగదీశాడు. అయితే... శర్వానంద్, సాయి పల్లవి కెమిస్ట్రీ ఫస్టాఫ్‌ను అందంగా చూసేలా చేశాయి. సెకండాఫ్ మాత్రం స్లో అయ్యింది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, యాక్టింగ్, పాటలు, లొకేషన్స్ కోసం సినిమాను చూడొచ్చు.

మాగల్ఫ్ రేటింగ్: 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com