ఇండోనేషియా:వరుస విపత్తులకు అసలు కారణం

- December 24, 2018 , by Maagulf
ఇండోనేషియా:వరుస విపత్తులకు అసలు కారణం

ఇండోనేషియా:వరుస విపత్తులు ఇండోనేషియాను వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి దీవుల దేశం చిగురుటాకుల వణికిపోతోంది. సరిగ్గా 14 ఏళ్ల కిందట కడలి కల్లోలం లక్షల మందిని బలిగొంది. 2004 డిసెంబరు 26న ఇండొనేషియాలోని సుమత్రా తీరంలో 9.3 తీవ్రతతో హిందూ మహాసముద్ర గర్భంలో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రం నుంచి సముద్రంలో మొదలైన రాకాసి అలలు 11 దేశాలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. సునామీ తీవ్రతకు మొత్తం 2 లక్షల 28 వేల మృత్యువాత పడగా.. ఒక్క ఇండోనేషియాలోనే లక్ష 68 వేల ప్రాణాలు కోల్పోయారు.

 

రెండు నెలల క్రితం సంభవించిన సునామీ కూడా ఇండోనేషియాకు తీర నష్టాన్ని మిగిల్చింది. సునామీకి తీర పట్టణమైన పాలూ కకావికలమైంది. సులవేసి ద్వీపంలో తొలుత భూకంపం సంభవించగా, ఆ వెంటనే సునామీ విరుచుకుపడింది. బీచ్‌ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రాకాసి అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడి వందలాది మందిని పొట్టనపెట్టుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 832 మంది మృత్యువాత పడ్డారు.

సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా స్ట్రెయిట్‌ సముద్రంలో క్రకటో అనే అగ్ని పర్వతంమే ఈ ఉప్పెనకు కారణమైంది. 1883లో ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అప్పట్లోనే ఈ విలయానికి 36 వేల మంది చనిపోయారు. అప్పట్లో ఎగసిపడిన బూడిద ఆకాశంలో 20 కిలోమీటర్ల వరకూ వెళ్లింది. అగ్ని పర్వతం బద్దలైన చప్పుళ్లు 4500 కిలోమీటర్ల దూరంలోని మారిషస్‌, ఆస్ట్రేలియా వరకూ వినిపించాయంటే దీని తీవ్రత ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రకటో బద్దలు కావడంతో ఏర్పడిన అగ్ని పర్వత బిలంలో 1928లో మరో అగ్ని పర్వతం ఏర్పడింది. దీనినే అక్కడ అనక్‌ క్రకటో అంటారు. అంటే, పిల్ల క్రకటో అని అర్థం. ఇటీవలి కాలంలో ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. రెండు మూడేళ్లకోసారి విస్ఫోటనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి గాల్లోకి వేలాది మీటర్లు మంటలు, బూడిదను వెదజల్లుతూనే ఉంది. దశాబ్దకాలంగా ఎప్పుడు పేలుతుందా అనే భయాందోళనలు రేకెత్తిస్తూనే ఉంది. అగ్ని పర్వతంగా ఏర్పడిన సరిగ్గా 90 ఏళ్ల తర్వాత ఇది ఇప్పుడు బద్దలైంది.

 

అగ్ని పర్వతం బద్దలైనప్పుడు సునామీ రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కొండచరియలు భారీగా విరిగి పడడం లేదా ఊహాతీతంగా అకస్మాత్తుగా నీరు చెల్లాచెదురు కావడం సునామీకి కారణమవుతుందని ఇంటర్నేషనల్‌ సునామీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ తెలిపింది. భూకంపాల కారణంగా సునామీలు వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించడానికి అధికారులకు కొంత సమయం ఉంటుంది. కానీ.. అగ్ని పర్వతం బద్దలై సునామీగా మారితే అధికారులకు హెచ్చరికలు చేసే సమయం ఉండదు. దీంతో ప్రజలను ముందే అప్రమత్తం చేసే అవకాశం లేకుండా పోయింది.

వరుస విపత్తులు రావడనికి ఓ కారణం ఉంది. ఇండోనేసియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవించడానికి ప్రధాన కారణం… ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కవగా సంభవించే పసిఫిక్‌ మహాసముద్రంలోని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో ఇండోనేసియా ఉండడమే. దీనికితోడు వాతావరణ మార్పులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేసియాలో విస్తారంగా అడవులను నరికివేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేసియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 129 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడి భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com