పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన కేసీఆర్..

- December 24, 2018 , by Maagulf
పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన కేసీఆర్..

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఆదివారం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించిన ఆయన.. సోమవారం కోల్‌కతా వెళ్లనున్నారు. మమతా బెనర్జీతో ప్రత్యమ్నాయ కూటమి ప్రయత్నాలపై సమాలోచనలు జరుపుతారు.

 
ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా, 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కేసీఆర్ రంగంలోకి దిగారు. తాము ఏ పార్టీకి బీ-టీమ్ కాదని స్పష్టం చేసిన గులాబీ బాస్.. గుణాత్మక మార్పుదిశగా అంతా కలిసి ముందడుగు వేస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యమ్నాయం ఉండాల్సిందేనని పునరుద్ఘాటించారు.

ఆదివారం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలోనే బస చేసిన కేసీఆర్.. సోమవారం భువనేశ్వర్ నుంచి కోణార్క్ వెళ్తున్నారు. అక్కడ ఆలయాల సందర్శన తర్వాత పూరీ జగన్నాథుని సన్నిధిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మళ్లీ భువనేశ్వర్ చేరుకుని అక్కడి నుంచి కోల్‌కతా వెళ్తారు. సోమవారం సాయంత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. కలకత్తా కాళీమాతను కూడా దర్శనం చేసుకున్నాక రాత్రికి అట్నుంచి ఢిల్లీ వెళ్తారు.

మగళవారం ఢిల్లీ కేంద్రంగా ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చలు జరపనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్, మాయావతి ఇద్దరితోనూ విడివిడిగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు. కేసీఆర్ ఏడాది కింద నుంచి దేశంలో ప్రత్యామ్నాయ కూటమి అవసరాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన ఆయన.. ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. రైతుబంధు లాంటి పథకాల్ని దేశమంతా అమలు చేయాలని ప్రతిపాదిస్తూనే, మిత్రపక్షాల్ని ఏకం చేసే బాధ్యత భుజానికెత్తుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com